నకి‘లీలల’కు చెక్‌

5 Jun, 2020 11:23 IST|Sakshi
ఉప్పాడ తీరంలో మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు (ఫైల్‌)

అర్హులకే అవకాశం వేటాడే వారికే పథకాలు

నకిలీ బోట్ల యజమానులపై వేటు

నిజమైన వారిని గుర్తించే పనిలో మత్స్యశాఖ

ఇప్పటికే రెండు విడతల తనిఖీ పూర్తి

పిఠాపురం: బోటుండేది ఒకరి పేరున.. వేటాడేది మరొకరు.. ప్రభుత్వ పథకం మాత్రం వేటాడే వారికి కాకుండా బోటున్న వారికే చెందుతుండడంతో నిజంగా వేటాడి జీవనం సాగించే సగటు మత్స్యకారులు నష్టపోతున్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే డీజిల్‌ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, బోట్ల సబ్సిడీ, ఇతర వేటాడే పరికరాల సబ్సిడీలను బోటు రిజిస్ట్రేషన్‌ ఆధారంగానే లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే కొందరు అనర్హులకు ఈ పథకాలు అందుతున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ నష్టపోకూడదన్న దృఢసంకల్పంతో బోటు ఉన్న నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మత్స్యశాఖాధికారులు జిల్లాలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

అధికారికంగా వెయ్యిబోట్లు
పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1000 బోట్లు అధికారికంగా మత్స్యశాఖలో రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వాటిలో ఎంత మంది అర్హులైన యజమానులు ఉన్నారనే విషయంపై మత్స్యశాఖ సిబ్బంది ఇటీవల తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో రెండు పర్యాయాలు తనిఖీ నిర్వహించారు. ప్రతి బోటును క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వివరాలు సేకరించారు.

పేరు మార్చుకోపోవడం వల్లే..
ప్రభుత్వం అందజేసే పథకాలను కొందరు నకిలీ యజమానులు తమ సొంతం చేసుకుంటున్నారు. ఒకసారి బోటు తయారు చేయించుకున్న యజమానులు తర్వాత కొంతకాలానికి దానిని అమ్మేస్తున్నారు. ఆ బోటును ఇతర మత్స్యకారులు ఉపయోగించుకుంటూ వేట సాగిస్తుంటారు. కానీ పాత యజమాని పేరుమీదే ఆ బోటు రిజిస్టర్‌ అయ్యి ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లబ్ధి పాత యజమానికే దక్కుతోంది. నిజంగా బోటుపై వేట సాగించే మత్స్యకారులకు అందడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నకిలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అర్హులు నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అవగాహనా లోపం వల్లే ఇలా జరుగుతుందన్న విషయంపై అధికారులను అప్రమత్తం చేయడంతో పేరు మార్పుపై మత్స్యకారుల్లో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. 

నకిలీల వేటలో అధికారులు
ప్రభుత్వ ఆదేశాలతో అసలైన బోటు యజమానులను గుర్తించే పనిలో మత్స్యశాఖాధికారులు నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో  సుమారు 20 మంది మత్స్యశాఖ సిబ్బంది తనిఖీ చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ల్యాండింగ్‌ ప్రదేశంలోను ఒక్కో అధికారి 20 బోట్ల చొప్పున తనిఖీ చేశారు. ప్రతి బోటుకు సంబంధించిన వివరాలు రెండు సీట్లపై తీసుకున్నారు. బోటు యజమాని ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్, యజమాని బోటు రిజిస్ట్రేషన్‌ నంబర్, లైసెన్స్‌ వివరాలు సేకరించారు. యజమానిని బోటు వద్ద ఉంచి ఫొటోలు తీసుకుని వివరాలు నమోదు చేశారు. ఇప్పటి వరకూ రెండు దఫాలు ఈ సర్వే నిర్వహించారు. ఇప్పటికీ ఎవరైనా బోటు యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోలేకపోతే మత్స్యశాఖాధికారులను సంప్రదించాలి.

అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకే..
ఎవరైనా బోటు కొనుగోలు చేస్తే వెంటనే పాత యజమాని పేరున ఉన్న బోటును తమ పేరుపై మార్చుకోవాలి. అలా కాకపోతే అర్హత లేనట్టుగా పరిగణిస్తాం. నేమ్‌ ట్రాన్స్‌ఫర్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందరూ తమ బోట్లకు తమ పేరున రిజిస్ట్రేషన్‌ మార్చుకోవాలి. బోటు ఉండి అర్హత ఉన్న వారిని మాత్రమే గుర్తిస్తాం. బోటు ఒకరి పేరున ఉండి మరొకరు దానిని ఉపయోగిస్తుంటే నకిలీగా గుర్తిస్తాం. ప్రతి బోటు యజమాని తమ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్, బోటు రిజిస్ట్రేషన్‌ నంబర్, లైసెన్స్‌ వివరాలు అందజేయాలి. అర్హులైన మత్స్యకారులందరికీ లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
– పి.జయరావు, మత్స్యశాఖ జేడీ, కాకినాడ

మరిన్ని వార్తలు