వాళ్లు వేటకొస్తున్నారు...

3 Jun, 2015 08:29 IST|Sakshi
వాళ్లు వేటకొస్తున్నారు...

సాక్షి, విశాఖపట్నం: చేపలవేటపై నిషేధం అమలులో తమిళనాడు ప్రభుత్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల్లో అలజడి రేపుతోంది. మత్స్యసంపద పునరుత్పత్తి, వృద్ధికి వీలుగా ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు (45 రోజులు) చేపలవేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఈ ఏడాది 45 రోజుల నిషేధాన్ని 61 రోజులకు పెంచింది. దీని ప్రకారం ఈస్ట్‌కోస్ట్ (తూర్పు తీరం) పరిధిలోకి వచ్చే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల మత్స్యకారులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలవేట నిషేధం అమలవుతోంది.

అలాగే వెస్ట్‌కోస్ట్ (పశ్చిమ తీరం)లోకి వచ్చే కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, లక్షదీప్ ప్రాంతాల వారు జూన్ 1 నుంచి జులై 31 వరకు వేటాడటానికి వీల్లేదు.  కాగా, నిషేధం విధించి 45 రోజులు పూర్తవుతున్న తరుణంలో పొరుగున ఉన్న తమిళనాడులో కొంతమంది మత్స్యకారులు చేపలవేటకు బయల్దేరారు. ఇటీవల  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి గతంలో మాదిరిగా 45 రోజుల నిషేధం సరిపోతుందని, ఇకపై తమను అనుమతించాలని కోరగా అందుకు అంగీకరించడంతో వేటకు ఉపక్రమించినట్టు ఆంధ్ర మత్స్యకార నాయకులు చెబుతున్నారు.

తమిళనాడు మత్స్యకారులు పొరుగున్న ఉన్న ఆంధ్ర సముద్ర జలాల్లో వేటకు వస్తుంటారని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. తమిళ జాలర్లు 61 రోజుల నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐఎఫ్‌ఐ) కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై  కేంద్ర ప్రభుత్వం స్పందించి నిషేధాన్ని పాటించకుండా చేపలవేట సాగించే బోట్లను సీజ్ చేయాలని, సంబంధిత మత్స్యకారులను అరెస్టు చేయాలని కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలిచ్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ వై.జి.కె.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. తమిళనాడు మత్స్యకారుల మాదిరిగానే పొరుగునే ఉన్న పాండిచ్చేరి మత్స్యకారులు కూడా మూడు రోజుల క్రితం నుంచి చేపలవే ట సాగిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు