ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు

9 Jan, 2020 05:22 IST|Sakshi
ధన్‌రాజ్, అప్పన్న

పాక్‌ చెర నుంచి విముక్తులైన మత్స్యకార తండ్రీకొడుకుల కన్నీటి గాథ

జగన్‌ సర్కారు చొరవతో విడుదలయ్యామని ఆనందం  

సాక్షి, అమరావతి: ‘‘పాక్‌ జైలుకెళ్లాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకపోయింది. మా బతుకులు ఇక్కడే తెల్లారుతాయనుకున్నాం. మాచేత ఇష్టానుసారం పనులు చేయించేవాళ్లు. అన్నం సరిగ్గా ఉండేది కాదు. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలసి గోడు చెప్పుకున్నామని, తప్పక విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారని మావాళ్లు వర్తమానం పంపారు. జగన్‌ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలిసి సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలరికి రూ.2 లక్షలిస్తామని కూడా ఆయన చెప్పారని విన్నాం. అన్నట్లుగా జగన్‌ మమ్మల్ని విడిపించడమేగాక ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.5 లక్షలు సాయం చేశారు. ఈ డబ్బుతో ఏదైనా పని చేసుకుని బతుకుతాం. ఈ జీవితం ఆయనదే..’’ అంటూ పాక్‌ చెర నుంచి విడుదలైన నక్కా అప్పన్న కన్నీటి పర్యంతమయ్యాడు. హుద్‌హుద్‌ పెను తుపానుతో సర్వం కోల్పోవడంతో బతుకుతెరువుకోసం ముక్కుపచ్చలారని కొడుకు ధన్‌రాజ్‌(14)తో కలసి గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అప్పన్న పొరపాటున పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో పాక్‌ నావికాదళ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు.

ఫలితంగా ఇతర మత్స్యకారులతోపాటు పాకిస్థాన్‌ జైలులో 14 నెలలపాటు దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు జగన్‌ సర్కారు చొరవతో ఇతర మత్స్యకారులతోపాటు పాక్‌ చెర నుంచి బయటపడిన వారిద్దరూ బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము పడిన ఇక్కట్లను వివరించారు. హుద్‌హుద్‌ తుపాను వల్ల రూ.8 లక్షల విలువచేసే ఆస్తి మొత్తం కొట్టుకుపోగా రూ.1.5 లక్షల అప్పు మిగిలిందని, సాయం కోసం అప్పటి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తే విదిల్చింది రూ.20 వేలేనని, దీంతో బతుకుతెరువు కోసం గుజరాత్‌ బోట్లల్లో చేపలు పట్టేందుకు తండ్రీకొడుకులు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ఇంట్లో పరిస్థితి బాగోలేక.. డబ్బుల్లేక.. అమ్మానాన్న పడుతున్న బాధ చూడలేక అయ్యకు తోడుగా తాను కూడా వెళ్లాల్సి వచ్చిందని ధన్‌రాజ్‌ చెప్పాడు. ఎట్టకేలకు జగన్‌ సర్కారు చొరవతో తాము విడుదలయ్యామని వారు ఆనందం వెలిబుచ్చారు.

ఈ జీవితం జగన్‌ భిక్షే: ‘‘జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు మళ్లీ బతికి వచ్చామంటే ఆయన పెట్టిన భిక్షే. కొత్త జీవితం ప్రసాదించడమే కాదు, బతకడానికి ఆర్థిక సాయమూ చేశారు. జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని పాక్‌ చెర నుంచి విముక్తుడైన శ్రీకాకుళంకు చెందిన మరో జాలరి దూడంగి సూర్యనారాయణ అన్నారు. 

మా కుటుంబాల్లో వెలుగులు నింపారు..
పులి నోట్లోకి వెళ్లి తిరిగొచ్చిన మా 20 మంది జాలర్లది పునర్జన్మే. సీఎం వైఎస్‌ జగన్‌ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేం. పాక్‌లో ఎన్నో బాధలు పడ్డాం. పాదయాత్ర సందర్భంగా నా భార్య సురాడ ముగతమ్మ వైఎస్‌ జగన్‌ను కలసి గోడు వెళ్లబోసుకుంది. జగనన్న ఆరోజు మాట ఇచ్చారు. నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు.
– సురాడ అప్పారావు, జాలరి, ఎచ్చెర్ల

దేవుడు జగన్‌ రూపంలో కాపాడాడు..
పాక్‌ జైల్లో ఆహారం తినలేక పోయేవాళ్లం. ఉదయం టీ, రెండు రొట్టెలిచ్చి పనిలోకి పంపేవారు. మధ్యాహ్నం రెండు రొట్టెలు నీళ్ల సాంబారు.. తినలేక పస్తులుండేవారం. ఎప్పుడు ఇంటికి చేరుస్తావ్‌ దేవుడా అని రోజూ ప్రార్థన చేసేవారం. దేవుడు సీఎం వైఎస్‌ జగన్‌ రూపంలో కాపాడాడు. ఆయన లేకుంటే మేమే లేం. మేం లేకుంటే మా కుటుంబాలు ఉండేవి కావు.     
– బాడి అప్పన్న, బడివానిపేట

జైల్లోనే చనిపోతామనుకున్నా..
పాక్‌ ప్రభుత్వం వదలదు. మా జీవితాలు ఇక్కడే ముగుస్తాయి. ఇక ఇండియాను, సొంత ఊరిని, కన్నవారిని చూడలేం అనుకున్నాం. 14 నెలలు నరకం చూశాం. పనులకు వెళ్లకపోతే కొట్టేవారు. జబ్బు చేస్తే సరైన మందులిచ్చేవారు కాదు. మా ఇంట్లో దేవుని స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టుకొంటా.     
– కేశం ఎర్రయ్య, డిమత్స్యలేశం గ్రామం, శ్రీకాకుళం జిల్లా

చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చా..
చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చాను. 2018 నవంబర్‌ 27న ఉదయం 7.30 గంటలకు పాకిస్తాన్‌ వారికి చిక్కాం. ఒక రోజంతా నీటిలోనే ఉంచారు. రాత్రి ప్రయాణం చేశాం. 28న పోలీసు కస్టడీకి అప్పగించారు. 29న ఉదయం 10.30కి జైలుకు తరలించారు. మేమంతా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకున్నాం. మాకు ప్రాణం పోసింది జగనన్నే.     – కొండా వెంకటేశ్, బడివానిపేట, శ్రీకాకుళం జిల్లా

జగన్‌ గెలవాలని ప్రార్థించా..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ పార్టీ గెలిస్తే మాకు పునర్జన్మతోపాటు జీవితాల్లో వెలుగులు వస్తాయనుకున్నాం. అనుకున్నట్లే జరిగింది. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. ఎవ్వరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్‌ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.
– గంగాళ్ల రామారావు, ఎచ్చెర్ల

జగన్‌ గెలిచారనగానే నమ్మకం కల్గింది
సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారనగానే నమ్మకం కల్గింది. అది నిజమైంది. మమ్మల్ని జగనన్న ఎప్పుడు విడిపిస్తారా అని చూశా. ప్రార్థన ఫలించి వచ్చి జగనన్న ఎదురుగా నిలబడ్డా. రూ.5 లక్షలు పారితోషికం ఇవ్వటం ఎంతో సంతోషాన్నిచ్చింది. మా విడుదలకు కృషి చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు.
– వాసుపల్లి శామ్యూల్, ఎచ్చెర్ల 

>
మరిన్ని వార్తలు