కడలి కల్లోలం

1 Jan, 2015 02:40 IST|Sakshi
కడలి కల్లోలం

సంతబొమ్మాళి, మందస:ఎం.సున్నాపల్లి.. తీరంలో లంగరేసిన ఐదు బోట్లను రాకాసి అలలు లాక్కుపోయి ముక్కలు చెక్కలు చేశాయి. వాటిలో ఉన్న వలలను సైతం ఖండఖండాలు చేశాయి. లక్షల రూపాయల నష్టం మిగిల్చింది.గెడ్డవూరు.. ఎగసిపడిన అలల తాకిడికి తీరంలో లంగరేసిన బోట్లకు కట్టిన ఇనుప గొలుసులు తెగిపోయాయి. బోట్లు సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటిని తెచ్చేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రయాణిస్తున్న తెప్ప తిరిగబడి నీళ్లలో పడిపోయారు. తీరంలో ఉన్న సహచర మత్స్యకారులు గమనించి వారిని రక్షించి తీరానికి తీసుకొచ్చారు.బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లకల్లోలంగా మారిన సముద్రం జిల్లాలోని రెండు గ్రామాల గంగపుత్రుల జీవితాల్లో విషాదం నింపింది. తననే నమ్ముకున్న వారిని కష్టాల్లోకి నెట్టింది.
 
 అప్పు చేసి కొన్నవి సముద్రార్పణం
 సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామ తీరంలో మత్స్యకారులు అల్పపీడనం హెచ్చరికలతో వేటకు వెళ్లకుండా పది బోట్లను లంగరు వేశారు. బుధవారం ఉదయం ఈదురుగాలులకు తోడు సముద్రపు అలలు ఉద్ధృతంగా ఎగసిపడటంతో ఐదు బోట్లు, వాటిలో ఉన్న వలలు కొట్టుకుపోయాయి. కొమర కృష్ణారావు, బుడగట్ల అప్పలస్వామిలకు చెందిన రెండు బోట్లు ముక్కల ముక్కలై పాతమేఘవరం తీరానికి చేరాయి. వలలు కూడా తెగిపోయాయి. గొండుపల్లి కనకరాజు, అర్జాల రాజారావు, ఎస్.అప్పయ్యలకు చెందిన బోట్లు, వలలు ఆచూకీ లేకుండా పోయాయి. ఒక్కో బోటు, వల విలువ రూ.13 లక్షలు ఉంటుందని, మొత్తం రూ.65 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు విలపిస్తూ చెప్పారు. ఏడాది క్రితమే అప్పులు చేసి బోట్లు కొన్నామని, ఆ అప్పు తీరకుండానే బోట్లు ధ్వంసమయ్యాయని ఆందోళనగా చెప్పారు. సముద్రంలో లంగరు వేసి ఉన్న ఐదు బోట్లు కూడా ఏ క్షణాన కొట్టుకుపోతాయోనని భయపడుతున్నారు. వీటిని తీరానికి తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా అలల ఉద్ధృతి కారణంగా సాధ్యపడలేదని చెప్పారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే బోట్లను రక్షించుకోలేకపోయామని వాపోయారు.
 
 పట్టించుకోని మెరైన్ పోలీసులు
 భావనపాడు మెరైన్ పోలీసులకు సమాచారమిస్తే తమ బోట్లే మరమ్మతులకు గురయ్యాయని చేతులెత్తేశారని, విశాఖపట్నం మెరైన్‌కు ఫోన్ చేస్తే అంత దూరం రాలేమన్నారని స్థానిక సర్పంచ్ ప్రకాశరావు ఆరోపించారు. ఈ తీరంలో జెట్టీ లేకపోవడం వల్ల విపత్తుల సమయంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే తహశీల్దార్ బి.రామారావు, ఎఫ్‌డీవో రామచంద్రరావు తీరప్రాంతాన్ని సందర్శించి నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు.
 
 బోట్లను రక్షించడానికి వెళ్లి..
 కాగా మందస మండలం గెడ్డవూరు తీరంలో కొట్టుకుపోయిన రెండు బోట్లను రక్షించడానికి వెళ్లిన నలుగురు మత్స్యకారులు నీళ్లపడి సహచరుల సాయంతో బతుకుజీవుడా అంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన వంక ధర్మరాజు, కొమర వెంకటరావులకు చెందిన మూడు బోట్లలో మంగళవారం గ్రామానికి చెందిన కొంత మంది మత్స్యకారులు చేపల వేట అనంతరం బోట్లకు లంగరు వేసి వెళ్లిపోయారు. అయితే అల్పపీడన ప్రభావంతో రాత్రి వేల అలల ఉద్ధృతి పెరిగింది. బుధవారం ఉదయం రెండు బోట్లకు కట్టిన గొలుసులు తెగిపోయి అవి సముద్రంలోకి కొట్టుకుపోయాయి. మిగిలిన మూడో బోటును తీసుకొచ్చేందుకు వంక ధర్మరాజు, పిచ్చుక మోహనరావు, వంక వీరాస్వామి, కొమర వెంకటరావులు తెప్పపై సముద్రంలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక అది బోల్తాపడటంతో వారంతా సముద్రంలో పడిపోయారు. తీరంలో ఉన్న తోటి మత్స్యకారులు గమనించి వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకొచ్చారు. రెండుబోట్లు పూర్తిగా పాడైపోయి, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయని బాధితులు చెప్పారు. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగిందని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దారు వి.శివబ్రహ్మానందం, ఎంపీపీ కొర్ల కవితాకన్నారావులు గ్రామానికి వెళ్లి పాడైన బోట్లను పరిశీలించారు.
 

>
మరిన్ని వార్తలు