మాటంటే మాటే..

7 May, 2020 03:18 IST|Sakshi
విశాఖ జిల్లా పెదజాలరిపేట వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో మత్స్యకారుల ఆనందం

పార్టీలు చూడకుండా అందరికీ సాయం చేస్తున్నారు

సీఎం వైఎస్‌ జగన్‌పై మత్స్యకారుల ప్రశంసలు

గతంలో ఎప్పుడూ సమయానికి సహాయం అందలేదు

ఇప్పుడు మీరు పార్టీలు చూడకుండా సాయం చేస్తున్నారు

గతంలో డీజిల్‌ సబ్సిడీ, సాయం అరకొరగా కొంతమందికే 

ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు.. ఈ మేలు ఎన్నటికీ మరవలేం

ఇంగ్లిష్‌ మీడియంతోనే మా పిల్లల తల రాతలు మారతాయి 

సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ సమయానికి సహాయం అందలేదని, ఇచ్చిన మాట మేరకు కష్టకాలంలో కూడా ఇప్పుడు మీరు పార్టీలు చూడకుండా సాయం చేస్తున్నారని పలు జిల్లాల మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసించారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమం సందర్భంగా   బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు నెలల వ్యవధిలోనే రెండోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. దేవుడి దయతో ఇంకా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా పూసపాటిరేగమండలం చింతపల్లి లేదా కోనాడలో ఫిషింగ్‌ జెట్టీ నిర్మించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. మత్స్యకారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.  

పలు పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు
మా ఆయన అనుకోకుండా పాకిస్తాన్‌ సైనికుల చేతికి చిక్కి జైలులో మగ్గిపోతున్నాడని.. మీరు పాదయాత్రలో మా ఊరికి వచ్చినప్పుడు చెప్పాము. విడిపిస్తానని మీరు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు జైలు నుంచి విడిపించారు. అంతే కాకుండా రూ.5 లక్షలు ఇచ్చారు. దీంతో మేము బోటు కొనుక్కుని ఇక్కడే బతుకుతున్నాం. అనేక సంక్షేమ పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో మూడు సార్లు రేషన్‌ ఇచ్చారు. డబ్బులు కూడా ఇచ్చారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా బోట్లకు బీమా సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నాము.
– కె.శిరీష, శ్రీకాకుళం జిల్లా
కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో తమ ఖాతాల్లో నగదు జమ అయిన మెసేజ్‌ చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న మోహన్‌బాబు కుటుంబం  

అప్పట్లో ఆ పార్టీ వాళ్లకు మాత్రమే ఇచ్చేవారు
గత ప్రభుత్వ హయాంలో చేపల వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఇచ్చేవారు. అది ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. ఆ పార్టీ వారికి మాత్రమే ఇచ్చేవారు. ప్రజా సంకల్ప యాత్రలో మా బాధలను మీకు చెప్పాం. దేవుడి దయతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.10 వేలు ఇస్తున్నారు. ప్రతి మత్స్యకారుడికి పెన్షన్‌ కింద రూ.2250 ఇస్తున్నారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. 
– మైలపల్లి పోలీసు, శ్రీకాకుళం జిల్లా

మత్స్యకారులకు పెద్ద కొడుకు మీరు
గతంలో మాకు కొంత మాత్రమే సబ్సిడీ వచ్చేది. మీరు వచ్చాక ఆ మొత్తం పెంచారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచి వెంటనే ఇచ్చేస్తున్నారు. మాలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇది మా అందరికీ గౌరవం. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కుటుంబానికి పెద్దకుమారుడు మీరు.  
– నర్సింగ్‌రావు, బోటు యజమాని, విశాఖపట్నం

పది కాలాలు మీరు చల్లగా ఉండాలి
అమ్మ ఒడి ద్వారా మా పిల్లలను చదివించుకునేందుకు మీరు సహాయపడుతున్నారు. నా ఇద్దరు బిడ్డలూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుండడంతో వారు సంతోషంగా బడికి వెళ్తున్నారు. మా వాళ్లలో చాలా మందికి వలంటీర్‌ పోస్టులు కూడా ఇచ్చారు. పది కాలాలు మీరు చల్లగా ఉండాలి. కరోనా సమయంలో కూడా మీరు ఉచితంగా మూడు సార్లు రేషన్‌ ఇచ్చారు, డబ్బు చేతిలో పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నాం. 
– గరికిన యోహాను, సూర్యారావుపేట, కాకినాడ

ఆ గ్రాఫిక్స్‌ సీఎం ఏమీ చేయలేదు
గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నుంచి పరిహారం ఇప్పించాలని కోరాం. 63 గ్రామాల ప్రజలు 103 రోజులు పోరాటం చేశారు. 13 నెలలకు పరిహారం ఇస్తామని వారు చెప్పారు. కానీ 6 నెలలకు మాత్రమే ఇచ్చి.. మిగతా డబ్బు ఇవ్వలేదు. అప్పట్లో గ్రాఫిక్స్‌ సీఎం ఆ విషయాన్ని మరిచిపోయారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. మీ పాదయాత్రలో మా సమస్యలను నివేదించాం. మీరు వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇచ్చారు. మత్స్యకారులకు మీరు చేసినట్టుగా మరెవ్వరూ సేవ చేయలేదు.
– పోతురాజు, గచ్చికాయలపురం, తూర్పుగోదావరి జిల్లా

త్వరగా స్పందించి ఆదుకున్నారు
నా భర్తను కోల్పోయి బాధల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు నాకు అండగా నిలబడ్డారు. మీ మేలును ఎప్పుడూ మరిచిపోలేను. కష్టం వచ్చిందని తెలియగానే ఇంత త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. (భావోద్వేగంతో ఈమె కన్నీళ్లు పెట్టుకోగా.. సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు)
– జెల్ల లక్ష్మి, కృష్ణా జిల్లా

పాకిస్తాన్‌ నుంచి వస్తారని అనుకోలేదు
జెట్టీలు, హార్బర్లు లేకపోవడం వల్లే మేం వలస పోతున్నామనే విషయాన్ని మీకు పాదయాత్రలో నివేదించాం. ఆ మాటలన్నీ మీరు గుర్తు పెట్టుకుని మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషకరం. పాకిస్తాన్‌ జైలు నుంచి తిరిగి వస్తామని మా మత్స్యకారులు అనుకోలేదు. కానీ మీరు తీసుకు వచ్చారు. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం.
– బర్రి పోలయ్య, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు