వేట లేదు...పూట గడవదు..

4 Jun, 2015 08:48 IST|Sakshi
వేట నిషేధంతో కాకినాడ జగన్నాథపురం ఉప్పుటేరులో నిలిచిన బోట్లు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేపలవేటపై నిషేధ వ్యవధిని 45 నుంచి 61 రోజులకు పెంచిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు మత్స్యకారులకు సాయం అందించకుండా కాలయాపన చేస్తోంది. దీంతో గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. చూస్తూండగానే బోట్లకు లంగరేసి 45 రోజులు గడిచిపోయాయి. ‘ఇన్ని రోజులూ అప్పులపై అప్పులు చేసి బతుకుబండి ఈడ్చుకొచ్చాం. మరో 15 రోజులు కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియడంలేదు’ అని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్తా జిల్లాల్లో ఉన్న మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.

వేట నిషేధసమయంలో గతంలో మత్స్యకారులకు కుటుంబానికి 31 కేజీల బియ్యం ఇవ్వగా, ఇప్పుడు దానికి బదులు రూ.4 వేలు సాయం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంతవరకూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.  దీంతో 9 జిల్లాల్లో  సముద్రంపై ఆధారపడి ఉన్న సుమారు రెండు లక్షల మంది పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే బోటుపై వేటకు వెళ్తే కళాసీ రోజుకు రూ.200, డ్రైవర్ రూ.400 తెచ్చుకునేవారు. నిషేధం అమలుతో వారు ఆ మేరకు ఆదాయం కోల్పోయారు. కూలికి వెళదామన్నా ఏ ఇతర పనీ రాదు. ఎవరూ పనిలో పెట్టుకోని పరిస్థితి.  దీంతో ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి, వడ్డీవ్యాపారులను ఆశ్రయించి పూట గడుపుకోవలసి వస్తోందని వారు వాపోతున్నారు.

ముందుగానే తెలిసినా.. సర్కారు అలసత్వం
ఏటా నిషేధ సమయం ఏప్రిల్‌లో మొదలవుతుందనే విషయం సర్కార్‌కు తెలియంది కాదు. అలాగే సముద్ర వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాలు ఎన్ననే విషయం మత్స్యశాఖకూ తెలియంది కాదు. అటువంటప్పుడు ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా ముందుగానే తమకు సాయం ఎందుకు అందించలేరని మత్స్యకారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిషేధ సమయంలో కాకుండా, వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చుకునే సమయంలో సాయం అందించి ఉపయోగమేమిటని అంటున్నారు. తమిళనాడులో మాదిరి నిషేధ సమయానికి ముందుగానే సాయం అందించాలని చేసిన విజ్ఞప్తులూ బుట్టదాఖలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు.

తలకు మించిన భారంగా పెట్టుబడి
ప్రస్తుతం వలల మరమ్మతులు తప్ప వేరే పనిలేని మత్స్యకారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. 15 రోజుల్లో తిరిగి వేటకు వెళ్లాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాలి. ఇది తలకు మించిన భారమవుతోందని కాకినాడకు చెందిన మత్స్యకార ప్రతినిధి కామాడి మాతరాజు చెప్పారు. ‘అసలు పొట్ట పోసుకోవడమే గగనమైపోతుంటే వలల మరమ్మతులకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?’ అని కాకినాడ ఏటిమొగకు చెందిన మత్స్యకారుడు కాటాడి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆహారం, ఇతర ఖర్చులు  రూ.30 వేలు, డీజిల్‌కు రూ.40 వేలు, ఐస్‌కు రూ.30 వేలు వెచ్చించాల్సి రావడం మోయలేని భారమవుతోందని మత్స్యకారులు వాపోతున్నారు.

మా బాధలేం చెప్పాలి
వేట లేకపోతే మాపరిస్థితి నరకమే. మాకు వచ్చేదెంత? రోజుకి రెండు, మూడొందలొస్తాయి. వాటితో కుటుంబాన్ని నెట్టుకొస్తాం. దాంట్లోనే మా ఖర్చులు కూడా. రెండు నెలలు వేట లేక అప్పులు చేసి కడుపు నింపుకున్నాం. గతంలో బియ్యం ఇచ్చేవారు. అవి కూడా సక్రమంగా అందేవి కావు. ఇప్పుడు ఒక్కో మత్స్యకారుడికి రూ.4 వేలు ఇస్తామంటున్నారు. అవి ఎప్పుడొస్తాయో? అసలు వస్తాయో రావో తెలియదు. పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో వేట నిషేధం మొదలవకుండానే ముందుగానే సాయం అందిస్తున్నారు. అలా మాకు కూడా ఇస్తే మా బతుకు మేం  బతుకుతాం.
- పంతాడి అప్పారావు, మత్స్యకారుడు, కాకినాడ

వేట తప్ప వేరే పని రాదు
మత్స్యకారులమైన మేం చేపల వేట తప్ప వేరే పని ఏమీ చేయలేం. 45 రోజులు ఉండే వేట నిషేధాన్ని ప్రభుత్వం 61 రోజులకు పెంచింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందక కుటుంబం గడవక అప్పులపాలవుతున్నాం. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని ముందుగానే అందించి ఆదుకోవాలి.
- నక్కా పోమయ్య, నాయకర్ కాలనీ, ఉప్పాడ


 

మరిన్ని వార్తలు