ఆశల తెరచాప 

2 Jun, 2020 08:01 IST|Sakshi
సిద్ధంగా ఉన్న సింగిల్‌ ఇంజన్‌ పడవలు

నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట  

తొలివిడత సముద్రంలోకి

150 బోట్లు ఫిషింగ్‌ హార్బర్‌లో సందడి  

పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు  ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 

సందడిగా ఫిషింగ్‌ హార్బర్‌ 
తూర్పు తీరంలో ఏప్రిల్‌ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలు కానుంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్‌ హార్బర్‌లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది.  
 
ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... 
20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది. సుమారు రూ.3 లక్షలు.  
వలలు సుమారు రూ.30 వేలు. 
బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. 
ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. 
సుమారు 15 టన్నుల ఐస్‌ రూ.22 వేలు. 
ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. 
మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  

ఒక రోజు వేటకే మొగ్గు 
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్‌ రన్‌ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు. బోట్లు 2వ తేదీ అర్ధరాత్రి వెళ్లి 3వ తేదీ జెట్టీలకు చేరడం వల్ల చేపల మార్కెట్‌ కూడా 3న తెరుచుకోనుంది. 

టన్ను ఐస్‌ రూ.1400 
ఫిషింగ్‌ హార్బర్లో ఉన్న 11 ఐస్‌ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కారి్మకులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్‌ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్‌ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్‌రన్‌కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్‌కు డిమాండ్‌ లేదేని యజమానులు చెబుతున్నారు.  

నిబంధనలు తప్పక పాటించాలి 
మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్‌ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్‌ హార్బర్‌లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్‌ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు. జూన్‌ 1 నుంచి వేటకు అనుమతిచ్చినా బోటు యజమానులు 2వ తేదీ అర్ధరాత్రి బయలుదేరనున్నారని, వీరు వేట ముగించి ఏ జెట్టీకి తమ బోటును చేరుస్తారో అక్కడే సరకు దించాలని సూచించారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్ని బోట్లను ఒకే జెట్టీమీదకు చేర్చకూడదని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆటోలు, వ్యాన్‌లకు హార్బర్‌లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. హార్బర్‌లోని షెడ్లలో వేలం నిర్వహణ కొనసాగుతుందని, వేలంలో పాల్గొనే మత్స్యకారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, మరబోట్ల సంఘాల ప్రతినిధులు పి.సి.అప్పారావు, బర్రి కొండబాబు, సీహెచ్‌.సత్యనారాయణమూర్తి, పోర్టు సిబ్బంది, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు