తీరంలోనే లంగరు..

7 Aug, 2018 11:43 IST|Sakshi
ముఖద్వారాలు పూడిపోవడంతో తాడు సాయంతో బోటును ఒడ్డుకు లాగుతున్న మత్స్యకారులు

ప్రకృతి వైపరీత్యాలు.. పాలకుల నిషేధాజ్ఞలతో జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపల వేట తీరం దాటడం లేదు. సముద్రం నిండుగా చేపలు ఉన్నా.. అందులోకి వెళ్లి వేట చేయలేని దుస్థితి. తీరం వెంబడి సముద్రంలోకి వెళ్లే ముఖద్వారాల వద్ద ఇసుక మేటలతో వేట సాగించే బోట్లు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పూడికతీతకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో గంగపుత్రులు వేటకు దూరం అవుతున్నారు. 

వాకాడు(నెల్లూరు): జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులకు చేపల వేటకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వేట అంతంత మాత్రంగా సాగుతోంది. దీనికి తోడు పునరుత్పత్తి కాలంగా ఏటా రెండు నెలలు వేటను నిషేధిస్తున్నారు. మిగిలిన కాలంలో సజావుగా వేట సాగించడానికి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు వేటకు ఇబ్బందికరంగా మారింది.     ప్రతి తీర గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి ముఖద్వారాలు ఉన్నాయి. సముద్రంపై సజావుగా వేటసాగాలంటే సాగర ముఖద్వారాలు తెరుచుకుని నిండుగా నీరు ప్రవహించాల్సి ఉంది. మత్స్యకారులు తమ బోట్లను ఎలాంటి ఆటంకం లేకుండా సముద్రంలోనికి తీసుకెళ్లడం, వేట తర్వాత మత్స్య సంపదను తీరానికి చేర్చడానికి వీలు అవుతుంది. కానీ ప్రస్తుతం సముద్రంతీరం ఆటు, పోటుల కారణంగా అన్ని చోట్ల ముఖద్వారాల వద్ద 10 మీటర్లు ఎత్తులో ఇసుక మేటలు వేయడంతో పూడిపోయింది.

వేటకు పాట్లు
జిల్లాలో 14 చోట్ల సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ముత్తుకూరు, జువ్వలదిన్నె ముఖద్వారాలు మినహా మిగిలిన ద్వారాలు మూసుకుపోవడంతో మత్స్యకారులు వేటకు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని 113 మత్స్యకార గ్రామాలకు చెందిన 6 వేల ఫైబర్‌ బోట్లపై ఆధారపడిన 60 వేల మంది మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సముద్రుడు కరుణించడంతో మత్స్యకారులకు ఇప్పుడు మత్స్యసంపద దండిగా దొరుకుతుంది. అయితే మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లలేక తమ బోట్లకు తీరం ఇవతలే లంగర్‌ వేయాల్సిన పరిస్థితి దాపురించింది.
 
పట్టించుకోని పాలకులు, అధికారులు
మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీతను పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ కాపులు, మత్స్యకారులు సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సభల్లో విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మత్స్యకారులే అప్పులు చేసి ఏటా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ముఖద్వారాల పూడిక తీత పనులు చేయించుకుంటున్నారు. జిల్లాలో వాకాడు, కోట, చిల్లకూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో మత్స్యకారులే చందాలు వేసుకుని ప్రస్తుతం ముఖద్వారాల పూడికలు తీయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాకాడు మండలం కొండూరుపాళెం సముద్ర ముఖద్వారం వద్ద మత్స్యకారులు పూడిక పనులను వేగంగా సాగిస్తున్నారు.

నిషేధ కాలానికి పరిహారం.. కాగితాలకే పరిమితం
రెండేళ్లుగా వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే సాయం కాగితాలకే పరిమితమైంది. గతంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట విరామం కింద రూ. 2 వేలు సాయం అందించే వారు.  చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రెట్టింపు చేసి రూ.4 వేలు సాయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మత్స్యకారుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ రోజులు గడిచే కొద్దీ నిరాశే మిగిల్చింది. వేట విరామం నగదు సాయం కోసం జిల్లాలో అధికారికంగా 3,500 బోట్లు, 21 మర పడవలపై ఆధారపడిన 15 వేల మంది మత్స్యకారులు నమోదు చేసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ విధిగా ఉండాలని మెలిక పెట్టి ఆంక్షలు విధించడంతో రెండేళ్లుగా దాదాపు 10 వేల మందికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వేట విరామంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించి ఉంటే మత్స్యకారులకు కొంత మేర ఉపయోగపడేది. కానీ రెండేళ్లుగా ఒక్కపైసా కూడా అందకపోవడం, వేట సజావుగా సాగకపోవడంతో మత్స్యకారులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తీర గ్రామాల్లోని ముఖద్వారాల వద్ద పూడిక తీత పనులకు చర్యలు చేపట్టాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుచున్నారు.

నెల రోజులుగా వేట లేదు
సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నెల రోజులుగా వేట చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. తూపిలిపాళెం, కొండూరుపాళెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు చందాలు వేసుకుని రూ. 5 లక్షలు వ్యయంతో పూడిక తీయిస్తున్నారు.      
–  మేలంగారి పోలయ్య, కాపు కొండూరుపాళెం 

రెండేళ్లుగా డబ్బులు రావడం లేదు
రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డులను అధికారులు తప్పులుగా ఉన్నాయంటూ మెలిక పెట్టి రెండేళ్లుగా వేట విరామం డబ్బు ఇవ్వడం లేదు. నిజంగానే ఆధార్, రేషన్‌ కార్డులు తప్పులుగా ఉంటే తమకు రేషన్, పింఛన్, బ్యాంక్, తదితర లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షాన ఉన్న అధికారులు ఆడుతున్న నాటకం మాత్రమే. గత ప్రభుత్వంలో వేట విరామం నగదు సకాలంలో అందేది.     – కె. రాజు, మత్స్యకారుడు, కొండూరుపాళెం

సముద్ర ముఖద్వారాల పూడిక పనులపై ప్రభుత్వానికి నివేదించాం
ఇసుక మేటలతో పూడిపోయిన సముద్ర ముఖద్వారాల పూడిక పనుల విషయమై ఇప్పటికే  ప్రభుత్వానికి నివేదించాం. పూడికతీత పనులు వేల రూపాయలతో జరిగేవి కావు. రూ.లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. –  కె రమేష్‌బాబు, ఎఫ్‌డీఓ

మరిన్ని వార్తలు