కొనసాగుతున్న చేపల వేట

23 Apr, 2018 07:06 IST|Sakshi
చింతపల్లితీరంలో వేటచేసి ఒడ్డుకు వస్తున్న మత్స్యకారులు

పూసపాటిరేగ : సముద్రంలో వేట చేపట్టకూడదన్న నిషేధం ఉన్నా యథావిథిగా చేపల వేట కొనసాగుతూనే ఉంది. చింతపల్లి సముద్రతీరంలో 25 వరకు బోట్లు వేట కొనసాగించి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒడ్డుకు చేరాయి. ఏప్రిల్‌ 15 నుంచి చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ  ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో మత్స్యకారులు విధిలేని పరిస్థితిలో వేటకొనసాగిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ప్రభుత్వం వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేట చేపట్టిన మత్స్యకారులపై జరిమాన కూడా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే నిషేధ సమయంలో   ఇవ్వాల్సిన జీవనభృతి సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే వేట చేపట్టాల్సివస్తోందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో సముద్రం చేపల వేటపై ప్రత్యక్షంగా నాలుగు వేల మంది.. పరోక్షంగా 16 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సమయంలో చెల్లించాల్సిన జీవనభృతి నేటికీ చెల్లించలేదని పలువురు మత్స్యకారులు వాపోయారు. నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుని కుటుంబానికి రూ. 4 వేలు చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. కాని ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో మత్స్యకారులకు జీవనభృతి చెల్లించడం లేదు.

అధికారపార్టీ అనుచరులకు మాత్రమే పరిహారం ఇచ్చి ప్రతి పక్షానికి చెందిన వ్యక్తులుగా కొంతమంది మత్స్యకారులపై ముద్రవేసి జీవనభృతి ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.  మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చేపల వేట యథావిథిగా కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సైదానాయక్‌ వద్ద ప్రస్తావించగా, సముద్రంలో చేపలవేటపై నిషేధం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. 

మరిన్ని వార్తలు