చేప చిక్కట్లే..

21 Jun, 2014 01:03 IST|Sakshi
చేప చిక్కట్లే..
 • మత్స్యకారులు విలవిల
 •  వలలు నిండక వెనక్కి వస్తున్న బోట్లు
 •  హార్బర్, చేపల మార్కెట్లు వెలవెల
 •  ఎల్‌నినో, వర్షాల్లేక సముద్ర గర్భంలోనే ఉండిపోతున్న మత్స్య సంపద
 • సాక్షి, విశాఖపట్నం : సముద్రం చేప చేతికి చిక్కనంటోంది. మత్స్యకారుల వలలో పడడానికి ససేమిరా అంటోంది. రోజుల తరబడి వేట సాగిస్తున్నా ఈసురోమనిపిస్తోంది. సముద్రంపై వేడి తట్టుకోలేక మరింత లోతుకు తరలిపోతోంది. జూన్‌లో వచ్చే వర్షపు నీరు తగలక చేప సంపద పైకి రానంటోంది. గతేడాది ఇదే సీజన్‌లో పుష్కలంగా కానాగడతలు, రెడ్‌ఫిష్‌లు, బొచ్చులు, శీలావతి, వంజరాలు, రొయ్యలతో కళకళలాడిన బోట్లు, మార్కెట్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. రోజుల తరబడి  వేట సాగించినా వలలు నిండక బోట్లు వెనుదిరుగుతున్నాయి. సముద్రంలోకి ఎప్పుడెళ్లినా 15 నుంచి 20 రకాల చేపలరాశులతో తిరిగొచ్చే మత్స్యకారులు ఈసురోమంటూ నాలుగైదు రకాలతోనే వెలితిగా ఒడ్డుకు చేరుతు న్నారు. దీని ప్రభావంతో మార్కెట్లో చేపల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
   
   అసలెందుకిలా?
   
  ఏటా జూన్‌లో సముద్రంలో చేపలవేటకు విరామం ముగియగానే విశాఖ హార్బర్ నుంచి 650 మెకనైజ్డ్ బోట్లు, వేలాది పడవలు మత్స్య సంపద కోసం వెళ్తాయి. మెకనైజ్డ్ బోట్లయితే పదినుంచి పదిహేను రోజులు సముద్రంలోనే ఉండిపోయి తిరిగి రకరకాల భారీ చేపలతో ఒడ్డుకు వస్తాయి. ఈసీజన్‌లో హార్బర్‌తోపాటు ఎక్కడికక్కడ మార్కెట్లో చేపల లభ్యత పెరిగి కొనేవాళ్లకు ధరలు కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాయి. వేలాది మత్స్యకారుల చేతిలో కాసులు గలగలలాడే సమయం కూడా ఇదే. ఈవిధంగా నెలకు సుమారుగా రూ.70 నుంచి రూ.90కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.
   
  కానీ ఈ సంవత్సరం చేపల వేటకు నిషేధం ముగిసిన తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారులు ఊహించని విధంగా ఖాళీ బోట్లతో తిరిగొస్తున్నారు. పది నుంచి ఇరవై రోజులు వేలాదిమంది సుదూర తీరం వెళ్లినా వలలు నిండడం లేదు. గతేడాది కానాగడతలు, రెడ్‌ఫిష్‌లు, బొచ్చులు, శీలావతి, వంజరాలు, రొయ్యలు ఇలా 15 రకాలు దొరకగా, ఇప్పుడు నాలుగైదు రకాలు మినహా చిక్కడం లేదు. దీంతో మార్కెట్లో మత్స్య సంపద పెద్దగా కనిపించడం లేదు. ఫలితంగా నగరానికి చెందిన 650 బోట్లు ఇప్పటివరకు రెండు దఫాలుగా వేటకు వెళ్లగా కనీసం బోటు సగానికికూడా నిండకపోవడంతో నష్టం భరించలేక హార్బర్‌లోనే నిలిపివేశారు.
   
  వేట విరామం ముగిసిన తర్వాత సముద్రంలో చేపల వేట సాగిస్తే టన్నులకొద్దీ చేపలు భారీగా వలకు చిక్కుతాయి. కానీ ఈదఫా వాతావరణంలో తీవ్ర మార్పులు సముద్రంపై తీవ్రప్రభావం చూపి తద్వారా చేపలు దొరకనిపరిస్థితి తలెత్తేలా చేసిందని మత్స్యకారులు, మత్స్యశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. సముద్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. నెలరోజులుగా ఉష్ట్రోగ్రత 42 డిగ్రీలకు మించి నమోదవుతోంది. వేడిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి.
   
  దాని వల్ల సముద్రజలాలపై వేడి వాతావరణం పెరగడంతో చేపలు బాగా లోతుకు వెళ్లిపోతున్నాయి. సముద్రంపై ఉష్ట్రోగ్రతలు 32 డిగ్రీలులోపు ఉంటేనే వేట ఆశాజనకంగా ఉంటుంది. ఖరీదైన టునా చేప వలలకు చిక్కాలంటే సముద్రంలో ఉష్ట్రోగ్రత 28డిగ్రీలు ఉండాలి. అలా అయితేనే ఈ రకం చేపలు పైకి వస్తాయి. వేడి కారణంగా ఈసారి వేటలో ఈ చేపలు అస్సలు దొరకడంలేదు.
   
  రుతుపవనాల జాడలేక ఇప్పటికే వ్యవసాయం ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇప్పుడిది మత్స్యరంగంపైనా ప్రభావం చూపుతోంది. వానలు కురవకపోవడం వల్ల సముద్రం చేప పైకిరాక మత్స్యకారులకు దొరకడం లేదు. వాస్తవానికి వర్షాలు కురిస్తే చెరువులు, కాలువలు, నదుల నుంచి భారీగా వర్షం నీరు రకరకాల చెత్తాచెదారంతో సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో ఆహారం కోసం చేపలు సముద్ర గర్భం నుంచి కొంచెం పైకి వస్తాయి. కానీ వర్షాలు రాక చేపల లభ్యత తగ్గిపోయింది.
   
  సముద్రంలో మత్స్య సంపద పెంచేందుకు ఏడాదిలో ఒకసారి వేట విరామం ప్రకటిస్తారు. ఈ సమయంలో అసలు వేట చేయడం నిషిద్ధం. కానీ ఇది ఆచరణలో జరగడం లేదు. నిషేధం అమల్లో ఉన్నా కొందరు అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. దీని వల్ల నిషేధం పూర్తయిన తర్వాత వేటకు వెళ్లే బోట్లకు చేపలు చిక్కడం లేదు. ప్రస్తుతం సముద్రంలో చేపలు చిక్కక మత్స్యకారులు నష్టపోతున్నారు.

  ఒకసారి మెకనైజ్డ్ బోటు సముద్రంలోకి వెళ్లిందంటే డీజిల్, ఐస్ అవసరాలకు రూ.2లక్షలు ఖర్చవుతుంది. చేపలు పడకపోవడంతో నష్టం పెరిగిపోతోంది. దీంతో హార్బర్‌లో బోట్లు ఖాళీగా లంగరేశాయి. ఫలితంగా మార్కెట్లోకి సముద్రం చేప రావడం లేదు. ఒకవేళ వచ్చినా ధర విపరీతంగా ఉంటోంది. నగర మార్కెట్లో కూడా చెరువు చేప మినహా సముద్రం చేపలు కనిపించడంలేదు. దీంతో వినియోగదారులు కొందామన్నా ధర చూసి బెంబేలెత్తిపోతున్నారు.
   
   చేపలు బయటికి రాక ఉపాధి పోతోంది
   సముద్రంలోకి కొత్త నీరు రాక చేపలు బయటికి రావడం లేదు. వేడి కూడా ఉండటంతో రెండుసార్లు 20 రోజులు సముద్రంలోకి వెళ్లి వస్తున్నా చేపలు చిక్కడం లేదు. గడిచిన చాలా ఏళ్లతో పోలిస్తే ఇటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి. వేటలేక సుమారు 12 వేల కుటుంబాలు ఖాళీగా ఉంటున్నాయి. పోనీ ఏదోలా మరోసారి వేటకు వెళ్దామంటే డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం డీజిల్ లీటర్ ధర రూ.61. కానీ ప్రభుత్వం మాకు రూ.6 సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీ గడిచిన పదేళ్లుగా ఇలాగే ఉంది. డీజిల్ ధరలేమో పెరిగిపోతున్నాయి.
   - పి.సి.అప్పారావు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్ల అధ్యక్షుడు
   

మరిన్ని వార్తలు