సాగని వేట.. గడవని పూట

1 Jul, 2019 08:59 IST|Sakshi

చేప చిక్కితే ఒట్టు

సాగర పుత్రులకు 15 రోజులుగా నిరాశే

సాక్షి, వాకాడు (నెల్లూరు): రోజూ తెల్లవారు జామున మూడు గంటలకే మత్స్యకారులు సముద్ర తీరానికి చేరుకుని గంగమ్మతల్లికి పూజలు నిర్వహించి, వేటకు బయలుదేరుతారు. అయితే చేపల జాడ కనిపించక ఒట్టి చేతులతో దరికి చేరుకోవాల్సి వస్తోంది. 61 రోజులపాటు బోసిపోయిన సముద్రతీరం నిషేధ ఆంక్షలు తొలగిన తరువాత కళ కళలాలి. అయితే ఒక్క చేప కూడా దొరక్కపోవడంతో ఖాళీ బోట్లు ఒడ్డుకు చేరుకుంటుండడంతో తీరం కళతప్పింది. మత్స్య సంపద ఏ వైపున అధికంగా ఉంటుందని సాగర పుత్రులకు అనుభవం ఉన్నప్పటికీ వారి అంచనాలు తప్పి నిరాశే ఎదురవుతోంది.

రెండు వారాలుగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని సముద్రంపై హోరుగాలి, అలల ఉధృతి, సుడులు తిరగడం తదితర కారణాలతో వేట సజావుగా సాగడంలేదు. అలాగే కెరటాలు ఎగసి పడడంతో తీరం కోతకు గురవుతూ మత్స్యకారుల బోట్లు లోపలకు దిగలేని పరిస్థితి. ఎలాగోల వేటకెళ్లిన మత్స్యకారులు వేట సాగక రెండు గంటలకే కొద్దిపాటి మత్స్య సంపదతో నిరాశతో వెనుతిరిగి, ఒడ్డుకు చేరుకుంటున్నారు. సంధి కాలంలో చేపలు గుడ్లు పెట్టి సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెంది విలువైన మత్స్య సంపద దండిగా దొరుకుతుందని భావించిన మత్స్యకారుల అంచనాలు తారుమారవుతున్నాయి.

జిల్లాలో మత్స్యకార మండలాలు 12
మత్స్యకార గ్రామాలు 118
మత్స్యకార జనాభా 2 లక్షలు
కుటుంబాలు 80 వేలు
మరబోట్లు 40
సాధారణ, ఇంజిన్‌ బోట్లు 5 వేలు

చిన్న పీతలే..
సముద్రంలో ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా కానా కచ్చేడి చేపలు దొరకడం సర్వ సాధారణమని మత్స్యకారులు అంటున్నారు. ప్రస్తుతం చిన్న పీతలు తప్ప చేపలు దొరకడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 12 తీర ప్రాంత మండలాలున్నాయి. కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వేట సాగకపోవడంతో 86 వేల మత్స్యకార కుటుంబాల జీవనం కష్టతరంగా మారింది. దీంతో జిల్లాలోని 40 మర పడవలు, 5 వేలకు పైగా ఇంజిన్, సాధారణ బోట్లు ఒడ్డున లంగరేసి ఉన్నాయి. నేటి ఆధునిక ప్రపంచంలో పూట గడవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ మత్స్యకారులు తమ కుల వృత్తినే నమ్ముకుని కడలిపై బతుకు నావ సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మూడేళ్లుగా ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణం వెరసి అరకొర వేటతో గంగపుత్రులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ప్రతి ఏటా చేపల పునరుత్పత్తి సమయంలో ప్రభుత్వం అందించే పరిహారం గత రెండేళ్లుగా అందడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి మరబోట్లు, యాంత్రీకరణ పడవలు జిల్లా తీరం వెంబడి సముద్రంలో వేట చేయడంతో మత్స్య సంపద నసించిపోతోంది. కనుక పొరుగు రాష్ట్రాల మరబోట్లు వేటను పూర్తిగా నిలుపుదల చేయాలని ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ దానిని బేఖాతరు చేసి వేట సాగిస్తున్నారు. చేపలు దొరకడం లేదని జిల్లా మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మత్స్యకారుల్లో ఆనందోత్సాహం నెలకొంది. తమకు సీఎం సాయం అందించి ఆదుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క చేప కూడా పడడంలేదు 
వేట విరామం తరువాత మత్స్య సంపద బాగా దొరుకుతుందని ఎంతో ఆశతో 15 రోజులుగా వేట సాగిస్తున్నాం. రోజంతా గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. తెల్లవారు జామున నాలుగు గంటలకు సముద్రంపై వేటకు వెళ్లాం. నాలుగు గంటలకు పైగా సముద్రంపై గాలించినా చిన్న పీతలు తప్ప ఒక్క చేపకూడా దొరకలేదు. బోటు డీజిల్‌ ఖర్చు తప్ప ఆదాయం లేదు.
– దక్షాది సతీష్, మత్స్యకారుడు, తూపిలిపాళెం

మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు 
సముద్రంపై పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు మరపడవలతో వేటాడి ఉన్న మత్స్యసంపదనంతా దోచుకెళ్తున్నారు. రోజంతా వేట చేసినా ఒక్క చేప చిక్కడం లేదు. రెండు వారాలుగా వాతావరణంలో మార్పు కారణంగా సముద్రంపై పోరుగాలి, అలల ఉద్ధృతి అధికంగా ఉంది. దీంతో వేట సక్రమంగా సాగడం లేదు. సాధారణంగా వేట నిషేధం తరువాత రింగు వలకు ఖరీదైన చేపలు దొరుకుతాయి. అలాంటిది ఈ సారి ఒక్క చేప కూడా దొరక లేదు. ఖాళీ వలతో వెనుతిరిగి రావాల్సి వస్తోంది.
– కె కనకయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం

మరిన్ని వార్తలు