మత్స్యకారుల ఆశలపై యుద్ధమేఘాలు...?

28 Feb, 2019 11:06 IST|Sakshi
బాధిత కుటుంబ సభ్యులు

ఎచ్చెర్ల క్యాంపస్‌: జీవనోపాధి కోసం వలస వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్‌కు బందీలుగా మారారు. వారి విడుదల కేంద్ర హోం, విదేశాంగ శాఖల జోక్యంతోనే సాధ్యం. చెరలో ఉన్న గంగపుత్రుల విడుదలకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం వారి కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లింది. తమ వారు ఇంత తొందరగా వస్తారో రారోనని వారిలో ఆందోళన తీవ్రమైంది. గుజరాత్‌ రాష్ట్రం వీరావల్‌లో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లో ప్రవేశించిన మత్స్యకారులు చెరశాల పాలయ్యారు. గత ఏడాది నవంబర్‌ 27న ఈ సంఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీరి తప్పు లేదని తెలిపింది.

భారత రాయబార కార్యాలయం వీరి విడుదలకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి సానుకూలంగా మారింది. తాము క్షేమంగా ఉన్నామని బందీలుగా ఉన్న మత్స్యకారులు రాసిన ఉత్తరాలు ఈ నెల 2న కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాక్‌ చెరలో ఉన్న 22 మందిలో మన జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు ఒకరు కాగా, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట, తోటపాలెం పంచాయతీలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. ఎలాంటి అవరోధం లేకుండా తమ వారు స్వస్థలాలకు చేరుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని వేడుకుంటున్నారు.

అనుకూల వాతావరణం ఉండేది
మత్స్యకారులు పాకిస్తాన్‌కు చిక్కిన సమయంలో అనుకూల వాతావరణం ఉండేది. ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో విడుదలవుతారనుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య తీసుకు వెళ్లాం. బందీలుగా ఉన్న వారి నుంచి ఈ నెల 2న ఉత్తరాలు అందాయి. పాకిస్తాన్‌ భద్రత దళాలు దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేస్తే విడుదల సాధ్యమయ్యేది. –మూగి రామారావు,మత్స్యకార యూనియన్‌ నాయకులు, డి.మత్స్యలేశం

మరిన్ని వార్తలు