ఔను.. వారంతా మళ్లీ పుట్టారు!

5 Feb, 2020 13:05 IST|Sakshi
బంగ్లాదేశ్‌ చెరనుంచి విముక్తి పొంది కలెక్టర్‌ కార్యాలయానికి వస్తున్న మత్స్యకారులు

బంగ్లాదేశ్‌ చెర నుంచి విడుదలైన 8 మంది మత్స్యకారులు

కుటుంబ సభ్యులను కలిసి భావోద్వేగాలు పంచుకున్న కడలి బిడ్డలు

అక్కడి చెరలో అనుభవించిన నరకాన్ని తలుచుకుని కన్నీరు

జిల్లాకు చేరుకున్న వారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

సాక్షిప్రతినిధి విజయనగరం: కడలిపుత్రులకు నిజంగా ఇది పునర్జన్మే. మృత్యుభయాన్ని నాలుగునెలలకు పైగా అనుభవించిన వారు అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి చొరవతో అక్కడినుంచి బయటపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన ప్రతీదీ చేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. ఇటీవలే పాకిస్థాన్‌ చెర నుంచి మన జిల్లాకు చెందిన మత్స్యకారులను విడిపించారు. తాజాగా బంగ్లాదేశ్‌ జైలు నుంచి మన మత్స్యకారులకు విముక్తి కలిగించారు. నాలుగు నెలలకుపైగా బంగ్లాదేశ్‌ జైల్లో అనేక కష్టాలు పడిన ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చారు.

దినదినగండం... నాలుగు నెలల జీవనం
బంగ్లాదేశ్‌ జైలులో తాము అనుభవించిన నాలుగు నెలలూ ప్రత్యక్ష నరకాన్ని చూశామని మత్స్యకారులుకన్నీరు మున్నీరుగా విలపించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నవారు ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఆ వివరాలివి. ‘అమృత’ అనే బోటులో వెళ్లి పట్టుబడ్డ మత్స్యకారులను పట్టుకున్న బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ తొంభై మంది సిబ్బంది ఉన్న ఒక భారీ ఓడతో ‘అమృత’ను లాక్కెళ్లారు. మత్స్యకారులను తాళ్లతో కట్టేసి యాభై మంది బంగ్లాదేశీ ఖైదీలుండే గదుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా పడేశారు. భాష తెలియని మనుషుల మధ్య, బానిసల్లా బతికారు. కేవలం రొట్టె, తినడానికి పనికిరాని ఆహారంతో అర్ధాకలితో గడిపారు. నిలబడి మూత్రవిసర్జన చేస్తే వెనుకగా వచ్చి లాఠీతో పరిగెత్తించి మరీ కొట్టేవారు. దుస్తులను బోటులోనే పోగొట్టుకోగా, ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నైట్‌ ప్యాంటునే రోజూ ఉతికి వేసుకున్నారు. ఇక్కడున్న వారి కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం. వస్తారో రారో తెలియని తమవారి కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూశారు. తినడానికి లేక, పిల్లలతో పాటు పెద్దలు పస్తులున్నారు. ఏదైతేనేం చివరికి మనసున్న ముఖ్యమంత్రి వల్ల వారు మళ్లీ మనుషులయ్యారు.

స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్‌
2019 సెస్టెంబర్‌ 24వ తేదిన పూసపాటిరేగ మండలం  తిప్పలవలస గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు విశాఖపట్నం షిప్పింగ్‌ హార్బర్‌ నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. ఆక్టోబర్‌ 2వ తేదీన బోటు పాడవడం... వాతావరణం అనుకూలింకచపోవడంతో వారికి తెలియకుండానే బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోకి వెళ్లిపోయారు. వెంటనే అక్కడి అధికారులు వారిని జైల్లో పెట్టారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి చొరవవల్ల జనవరి 28వ తేదీన వారు  బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి బోటులో కోల్‌కత్తా జలాల్లోకి ప్రవేశించారు. హరిపురం చేరుకునేసరికి బోటు మళ్లీ మొరాయించింది. ఇక చేసేది లేక దానిని ఆ గ్రామంలోనే వదిలి వేరే బోటులో కోల్‌కత్తా చేరుకుని అక్కడినుంచి రైల్లో విశాఖ చేరుకున్నారు. మంగళవారం ఉదయం వారు విజయనగరం వచ్చారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మత్స్యశాఖ డీడీ సోమలత, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, విశాఖ మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌ కలెక్టరేట్‌ వద్ద మత్యకారులకు  స్వాగతం పలికారు. వారిని, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌ను సత్కరించారు. అనంతరం మత్స్యకారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
పరాయి దేశంలో ఖైదీగా గడపడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు దూరంగా, తిరిగి వస్తామో రామో తెలియని భయంలో మత్స్యకారులు అనుభవించిన మాససిక సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. సీఎం, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో వారికి విముక్తి లభించింది. ప్రభుత్వ పరంగా వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే చేయూతనందిస్తాం.
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్,కలెక్టర్, విజయనగరం

తక్కువ కాలంలోనే విడుదల అయ్యాం
ఇంత తక్కువ కాలంలో మన దేశానికి వస్తామని అనుకోలేదు. మమ్మల్ని మా కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన దయ వల్ల మా భార్య, పిల్లలను కలుసుకోగలిగాం.– వాసుపల్లి అప్పన్న, మత్స్యకారుడు,తిప్పలవలస.

సీఎం కారణంగానే పునర్జన్మ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మత్యకారులకు పునర్జన్మ ప్రసా దించారు. ఆయన చొరవ తీసుకోవడం వల్లనే తక్కువ కాలంలోనే మత్స్యకారులను బంగ్లాదేశ్‌ చెర నుంచి విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగాం.     – బడ్డుకొండ అప్పలనాయుడు,ఎమ్మెల్యే, నెల్లిమర్ల. 

మరిన్ని వార్తలు