వాహనాల పేరిట వసూళ్లు

5 Oct, 2018 06:37 IST|Sakshi
మాట్లాడుతున్న మడవలస గ్రామ గిరిజన మత్సకారులు

ఏళ్లు గడుస్తున్నా అందని వాహనాలు

అధికారుల వలలో  గిరిజన మత్స్యకారులు

దర్యాప్తునకు నిర్ణయించిన ఐటీడీఏ పీఓ   

వారంతా గంగమ్మ తల్లిని నమ్ముకొని జీవించేవాళ్లు. వలలో చేపలు పడితేగాని పూట గడవని మత్స్యకారులు. వేకువజామునే వేటకు వెళ్లి రోజంతా కష్టపడి వలలో కాసిన్ని చేపలు పడాలని ఆశిస్తూ అదే తమ జీవనాధారం అని నమ్మే అమాయక గిరిజనులు. కానీ అధికారులకు వారిపై కూడా కనికరం కలగలేదు. వారిని నిలువునా ముంచేశారు. మత్స్యకారులకు అవసరమైన పరికరాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడిచినా నేటికీ పరికరాలు ఇవ్వలేదు.

విజయనగరం ,సాలూరు రూరల్‌: కుటుంబ పోషణ కోసం నమ్ముకున్న గంగమ్మ తల్లి వద్దకు వేకువజామునే చేరుకొని జీవనం సాగించే మత్స్యకారులను అధికారులు వదల్లేదు. ప్రభుత్వం తరఫున సైకిళ్లు, ఎక్సెల్‌ బైక్‌లు ఇస్తామని అధికారులు మత్స్యకార సంఘ నేతలను నమ్మించారు. దీని కోసం కొంత మొత్తం డబ్బులు ముందస్తుగా చెల్లించాలని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. అధికారులను నమ్మిన వారంతా కూడబెట్టుకున్న లేదా అప్పులు చేసి అధికారులకు డబ్బులిచ్చారు. డబ్బులిచ్చి ఏడాదైనా ఎటువంటి సైకిళ్లు, ఎక్సెల్‌ బైక్‌లు వారికి అందలేదు. ఇప్పటికీ అందుతాయనే ఆశతోనే ఉన్నారు. పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయ నిర్వాసిత ఏడు గ్రామాల్లోని గిరిజన మత్స్యకారులను మత్స్య శాఖకు చెందిన అధికారులే నిలువునా మోసం చేశారు.

పెద్దగెడ్డ రిజర్వాయరు నిర్వాసిత మడవలస, తురాయిపాడు, కేసలి, కోడికాళ్లవలస, ఎరడ్లవలస, కుమ్మరివలస, తోటపాడు గ్రామాల్లో 186 గిరిజన మత్స్యకార కుటుంబాలు సొసైటీలో ఉన్నారు. వీరికి పెద్దగెడ్డ రిజర్వాయరులో చేపలు పట్టేందుకు అనుమతులున్నాయి. వీరికి మత్స్యశాఖ, ఐటీడీఏ ద్వారా 90 శాతం రాయితీతో సైకిళ్లు, ఎక్సెల్‌ బైకులు వంటివి అందిస్తామని మోసం చేశారు. రూ.వెయ్యి చెల్లిస్తే సైకిల్, రూ.5వేలు చెల్లిస్తే ఎక్సెల్‌ వాహనం అందిస్తామని ఐటీడీఏ ఫిషరీస్‌ డెవలప్‌మెంటు అధికారి మురళి తమకు చెప్పినట్టు మడవలస గ్రామానికి చెందిన సుకర కామరాజు, కందుల చిన్నారావు, బంటు జోగక్య, కిరసాన జమ్మయ్య తదితరులు తెలిపారు. ఈ మొత్తాన్ని మత్స్యకార సంఘం అధ్యక్షునికి అందించాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఎఫ్‌డీఓ మాటలు నమ్మి ఈ ప్రాంతం నుంచి సైకిళ్ల నిమిత్తం రూ.86 మంది రూ.వెయ్యేసి చొప్పున్న మొత్తం రూ.86వేలు, కొందరు ఎక్సెల్‌ కోసం రూ.5వేలు పెద్దగెడ్డ మత్స్యకార అధ్యక్షుడు కొండలరావుకు అందించినట్టు తెలిపారు. ఇదంతా జరిగిన ఏడాది దాటినా కేవలం 45 మందికి మాత్రమే సైకిళ్లు అందించారని మిగతా వారికి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరువాత మత్స్యశాఖ అధికారుల జాడ లేకుండా పోయిందని వాపోతున్నారు.

ఎఫ్‌డీఓకు ఇచ్చా...
86 సైకిళ్ల నిమిత్తం డబ్బులను సేకరించాం. ఈ మొత్తాన్ని ఎఫ్‌డీఓ మురళికి ఇచ్చాం. పలు కారణాల వల్ల మంజూరులో జాప్యం జరిగిందంటూ చెప్పారు. ఒత్తిడి మేరకు రూ.17వేలు వెనక్కి ఇచ్చారు.          –కొండలరావు, కేసలి,పెద్దగెడ్డ  మత్స్యకార సంఘ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు