నడికడలిలో ఏమయ్యారో!

28 Jul, 2014 00:18 IST|Sakshi
నడికడలిలో ఏమయ్యారో!

 కొత్తపల్లి :చేపల వేటకు ఆరుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన ఫైబర్ బోటు ఇంజన్ చెడిపోవడంతో ఆచూకీ లేకుండా పోయింది. తెరచాప సాయంతో ఒడ్డు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పిన అనంతరం వారి సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో.. వారు ఏమైందీ, ఎలా ఉన్నదీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.   కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన గంపల దేవుళ్ళుకు చెందిన బోటుపై బుధవారం ఉదయం ఉప్పాడకు చెందిన మైళపల్లి సత్యనారాయణ, కోనపాపపేటకు చెందిన ఉప్పాడ బంగారయ్య, తిక్కాడ పైడియ్య, తిత్తి సుబ్బారావు, కురిపి సూరిబాబు,
 
 మరొక వ్యక్తి వేటకు వెళ్లారు. ఈ బోటుతో పాటే వెళ్లిన బోట్లన్నీ వేట ముగించుకుని శనివారమే తిరిగి తీరం చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన దేవుళ్లు సెల్‌ఫోన్లో సంప్రదించగా   శుక్రవారం ఉదయం తమ బోటు ఇంజన్ చెడిపోయిందని, తెరచాప సాయంతో ఒడ్డుకు చేరుకోవడానికి యత్నిస్తున్నామని బోటులోని వారు చెప్పారు. అయితే.. బోటులోని వారి దగ్గరున్న సెల్‌ఫోన్ ఆదివారం ఉదయం 11 గంటల వరకే పని చేసిందని, తర్వాత వారి నుంచి సమాచారం లేదని దేవుళ్లు చెప్పారు.
 
 తనతో మాట్లాడినప్పుడు భైరవపాలానికి సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్నట్టు చెప్పారన్నారు. గాలి వాలు బోటుకు అనుకూలంగా లేనందున తెరచాప సాయంతో ఒడ్డుకు చేరడం  కష్టసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బోటు ఆచూకీ కోసం ఆదివారం మధ్యాహ్నం భైరవపాలెం నుంచి మరో రెండు బోట్లు పంపామని, రాత్రి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. కాగా మత్స్యకారులు గల్లంతైన వార్త మీడియాలో రావడంతో కలెక్టర్ నీతూప్రసాద్ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. భైరవపాలెం సమీపంలోని ఓ దీవి వద్ద మత్స్యకారుల బోటుందని తెలిసిన అధికారులు.. బోట్లపై అక్కడకు వెళ్లి అందులోని నలుగురిని ఒడ్డుకు చేర్చారు. వారు బలుసుతిప్పకు చెందిన వారని తెలియడంతో కోనపాపపేట మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగించనున్నారు.
 
 గాలివాటానికి కొట్టుకుపోయే అవకాశం..!
 ఆరుగురు మత్స్యకారులతో ఆచూకీ లేకుండా పోయిన బోటు ఇంజన్ శనివారం ఉదయం చెడిపోవడంతో.. గత మూడురోజు లుగా వారు తెరచాపే ఆయుధంగా కడలితో పోరాడుతూ ఒడ్డుకు చేరేందుకు శ్రమిస్తున్నట్టు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం చివరి సారి సెల్‌ఫోన్‌లో మాట్లాడినప్పుడు వారు బోటు యజమానికి చెప్పిందీ అదే.  ప్రస్తుతం ఈదురు గాలులు అధికంగా ఉండడంతో బోటు గాలివాటానికి కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇతర మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటులోని సోలార్ వ్యవస్థ వల్ల సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయే సమస్య ఉత్పన్నం కాదని, గాలి వాలుకు సిగ్నల్ అందనంత దూరానికి కొట్టుకు పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా గల్లంతైన మత్స్యకారుల కోసం మెరైన్, కోస్టుగార్డు, రిలయన్స్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కలెక్టరు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు తీరప్రాంత సిబ్బందిని అప్రమత్తం చేశారు.  చీకటి పడడం, ఈదురు గాలులు పెరగడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగిందని,  సోమవారం ఉదయం కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. కాగా బోటు యజమాని పురమాయింపుపై బయల్దేరిన రెండు బోట్లలోని మత్స్యకారులూ గాలింపు కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
 
 క్షేమంగా తిరిగి రావాలని పూజలు
 బోటు ఇంజన్ చెడిపోయి, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు వారి క్షేమసమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. గ్రామపెద్దలు, పలువురు గ్రామస్తులు తీరంలో నిలబడి.. ఆరుగురు మత్స్యకారుల రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు