15 నుంచి ఏపీలో చేపల వేటపై నిషేధం

28 Mar, 2016 21:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సముద్రంలో మత్స్య సంపద పెంపు, సమర్థ నిర్వహణ, సంరక్షణతో పాటు సముద్ర భద్రతా కారణాల రీత్యా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే 61 రోజుల పాటు అన్ని రకాల చేపల వేటను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కేంద్రప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సోమవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలంలో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది. ఈప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిషేధాన్ని విధించడం ఆనవాయితీ.

తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్, జూన్ నెలల మధ్య, పశ్చిమ తీరంలో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు కేంద్రప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ సముద్ర తీర చేపల వేట (నియంత్రణ) చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధ కాలంలో రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో మరపడవులే కాకుండా చిన్నతరహా సంప్రదాయ పడవుల్ని సైతం అనుమతించరు. చేపల వేట నిషేధ కాలానికి జాలర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుంది.

>
మరిన్ని వార్తలు