‘అనంత’ ఆసుపత్రిలో మరణమృదంగం

3 Oct, 2018 04:45 IST|Sakshi

సర్వజనాస్పత్రిలో ఐదుగురు చిన్నారుల మృత్యువాత 

ఆందోళనకు దిగిన ఓ కుటుంబ సభ్యులు

వైద్యుల నిర్వాకమే కారణమంటూ ఆగ్రహం

కొడుకు మృతితో తల్లడిల్లిన ఓ తల్లి ఆత్మహత్యాయత్నం

విచారణకు ఆదేశిస్తామన్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మంగళవారం ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. చిన్నపిల్లల వార్డులో ఒకరు, అదే విభాగానికి సంబంధించి ఎస్‌ఎన్‌సీయూలో ఒకరు, లేబర్‌ వార్డులో ముగ్గురు పసికందులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారంటూ ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న తన బాబు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడంటూ విలపించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడంతో పెనుప్రమాదం తప్పింది.

బిడ్డ కడుపులోనే చనిపోయిందన్నారు..
పెదవడుగూరు మండలం మేడమాకులపల్లికి చెందిన వీరనారాయణచారి తన భార్య ప్రమీలకు మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో హుటాహుటిన సర్వజనాస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు కాసేపట్లో కాన్పు చేస్తామని చెప్పారు. అనంతరం కాన్పు చేసిన వైద్యులు.. మృత శిశువును అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గైనిక్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని వీరనారాయణచారి ఆరోపించాడు. మూడ్రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పడమేంటని తప్పుపట్టాడు. గత నెల 28న పరీక్షలకు వచ్చినప్పుడు కడుపులో బేబి, తల్లి బాగా ఉన్నారని చెప్పి.. అంతలోనే మూడ్రోజుల క్రితమే పాప చనిపోయిందని చెప్పడమేంటన్నాడు. వైద్యుల నిర్వాకంతోనే తమ పాప చనిపోయిందని మండిపడ్డాడు. దీనిపై ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే..
గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జశ్వంత్‌(11నెలలు) నిమోనియాతో బాధపడుతుండడంతో గత నెల 25న చిన్నపిల్లల వార్డులో చేర్చారు. మంగళవారం ఉదయం బాబు ఆరోగ్యం కుదుటపడిందని పీఐసీయూ నుంచి సాధారణ వార్డులోకి వైద్యులు మార్చారు. తల్లి కాస్త ఇడ్లీ తిన్పించింది. ఆ తరువాత కొద్ది గంటలకే ఆ తల్లి కేకలేస్తూ పీఐసీయూలోకి వచ్చింది. దీంతో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాబు మృతి చెందినట్టు తెలిపారు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే తన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. అయ్యో దేవుడా! ఎంత పని చేశావయ్యా.. రేపోమాపో ఇంటికి తీసుకెళ్దామనుకుంటే అంతలోనే ఘోరం జరిగిందయ్యా. నాకింకెవ్వరు దిక్కయ్కా అంటూ.. రోదించడం అందర్నీ కలచివేసింది. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బాత్‌రూంలోకి వెళ్లి చీరతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు.

మరో ముగ్గురూ..
మరోవైపు ఎన్‌ఎస్‌సీయూలో శెట్టూరు యాటకల్లు గ్రామానికి చెందిన నగ్మ అనే మహిళకు జన్మించిన నెలలు నిండని ఆడబిడ్డ(980 గ్రాములు) మృతిచెందగా, కాన్పుల వార్డులో కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన గౌతమికి పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అదే వార్డులో మరో మహిళకు పుట్టిన మగబిడ్డ కూడా పురిట్లోనే మరణించాడు. ఎన్నడూ లేనివిధంగా లేబర్‌వార్డులో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది.

విచారణకు ఆదేశిస్తాం..
లేబర్‌వార్డులో పసికందులు చనిపోయిన విషయం తెలియదు. విచారణకు ఆదేశిస్తా. చిన్నపిల్లల వార్డులో జశ్వంత్‌ అనే బాబు చనిపోయాడు. ఇడ్లీ తిన్పించే సమయంలో అన్నవాహికలో కాకుండా లంగ్స్‌లో పడింది. అందుకే బాబు మృతిచెందాడు. ఎన్‌ఎస్‌సీయూలో ఓ బిడ్డ మృతిచెందింది.
–డాక్టర్‌ జగన్నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు