ఓటు నమోదుకు ఇక ఐదు రోజులే సమయం

11 Mar, 2019 03:21 IST|Sakshi

ఓటు ఉందో లేదో చూసుకోండి

లేకపోతే 15లోగా దరఖాస్తు చేయండి.. ఓటుహక్కు కల్పిస్తాం

ఆ తర్వాత ఓటు లేదంటే ఏమీ చేయలేం

ఇక ఓట్లు తొలగించడానికి అవకాశం లేదు..

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం

రాష్ట్రంలో 3.82 కోట్ల ఓటర్లు

ఎన్నికల నిర్వహణకు 4 హెలికాప్టర్లు

రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఓటరుగా చేరేందుకు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని, ఆలోగా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, 15వ తేదీ తరువాత ఓటు లేదంటే ఏమి చేయలేమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం ద్వివేది ఆదివారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా చేరడానికి సమయం ఉందని, అయితే దరఖాస్తుల వెరిఫికేషన్‌కు పది రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఈ నెల 15లోగా పేరుందో లేదో చూసుకుని దరఖాస్తు చేసుకోమని కోరుతున్నట్లు ద్వివేది వివరించారు.

ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి ఏడు రోజుల నోటీసు సమయం పడుతుందని, ఆ తర్వాత మూడు రోజులు వెరిఫికేషన్‌కు సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ఓటర్లను తొలగించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫారం–7లకు సంబంధించి ఇప్పటివరకు 9,27,542 దరఖాస్తులు రాగా వాటిలో 7,24,940 తనిఖీ చేశామని, అందులో 5,25,957 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. ఇంకా 1.57 లక్షల ఫారం–7 దరఖాస్తుల్ని పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వీటిని వెరిఫై చేశాక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు 3.82 కోట్లకు చేరినట్లు వివరించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది చెప్పారు. మొత్తం 45,920 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 9,345 పోలింగ్‌ కేంద్రాల్ని సమస్యాత్మకంగా గుర్తించామని, అక్కడ కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 200 నుంచి 300 వరకు పోలింగ్‌ కేంద్రాలు పెరిగే వీలుందని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మంచినీటి వసతితోపాటు టెంట్‌లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు, ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు స్లిప్‌లు ఇస్తామని చెప్పారు. అయితే ఓటర్‌ స్లిప్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణించరని, ఈసీ పేర్కొన్న ప్రత్యామ్నాయ 11 గుర్తింపు కార్డుల్లో ఏదో  ఒక కార్డును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకోసం వచ్చిన 2,64,712 పెండింగ్‌ దరఖాస్తులున్నాయని, వాటిన్నింటినీ వెరిఫై చేసి క్లియర్‌ చేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని, కొన్ని స్పీడు బోట్లను కూడా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుంటే సామాన్యులెవరైనా సరే సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి శాఖ ఓ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి: అయ్యన్నార్‌
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి సారిస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. పది లక్షలలోపు నగదు లావాదేవీలపై పోలీసులు విచారణ చేస్తారని, అంతకుమించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని చెప్పారు. సామాన్యులెవరైనా నగదును తీసుకెళుతున్నప్పుడు సంబంధిత ధ్రువపత్రాలుంటే, అలాంటి వాటికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. ఎక్సైజ్, రవాణా, ఆదాయపు పన్ను, కస్టమ్స్‌ అధికారులతో కూడిన బృందాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి బృందంలో ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ స్థాయిలో ఓ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ అక్కడికక్కడే విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తారని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులపై 446 కేసులు నమోదు చేశామని, వాటిని సిట్‌కు బదలాయించామని చెప్పారు. ఐపీ అడ్రస్‌లకోసం సి–డాక్‌కు లేఖ రాశామన్నారు. 

మరిన్ని వార్తలు