హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల అదృశ్యం

18 Nov, 2013 09:30 IST|Sakshi

పెనమలూరు, న్యూస్‌లైన్ : పెనమలూరులోని అనాథ బాలికల హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు ఆదివారం వేకువజామున అదృశ్యం కావడంతో కలకలం రేగింది. తొలుత పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేసినా.. ఆదివారం రాత్రికి యజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ధర్మేంద్ర తెలిపిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 
పెనమలూరు వంతెన వద్ద నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నవీన ఫర్ గాళ్స్ హాస్టల్ ఉంది. దీనిలో మొత్తం 19మంది అనాథ యువతులు ఉంటున్నారు. వీరికి నవజీవన్ బాలభవన్ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. శనివారం రాత్రి ఈ యువతులు భోజనాల అనంతరం నిద్ర పోయారు. వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్.లక్ష్మి, కె.కావ్యలు బాత్‌రూమ్‌కు వెళ్లటానికి లేవగా నెట్‌వాచ్‌ఉమెన్ మేరీ తాళాలు తీసింది. బాత్‌రూమ్‌కు వెళ్లిన వారు తిరిగి రాగానే మళ్లీ తాళం వేసింది. అప్పటికి అందరూ ఉన్నారు.

ఉదయం లేచి చూసేసరికి ఐదుగురు యువతులు అదృశ్యం కావడాన్ని వార్డెన్ గుర్తిం చారు. హాస్టల్‌లో రెండేళ్లుగా ఉంటున్న పరిటాలకు చెందిన ఎం.రమణ, కృష్ణలంకకు చెందిన ఎస్.లక్ష్మి, విజయవాడ శిఖామణి సెంటర్‌కు చెందిన ఎన్.గాయత్రి, రాజమండ్రికి చెందిన ఎం.సంతోషి, గుడివాడకు చెందిన కావ్య అదృశ్యమైనవారిలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాచ్‌ఉమెన్ వద్ద నుంచి గప్‌చుప్‌గా తాళం తీసుకుని వారు పారిపోయి ఉంటారని వార్డెన్ భావిస్తున్నారు. వీరందరి వయస్సు 18-19 సంవత్సరాలే. వీరు విజయవాడలో చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు, టైలరింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఈ యువతుల అదృశ్యం విషయాన్ని హాస్టల్ యాజమాన్యానికి వార్డెన్, వాచ్‌మెన్ తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
 
హాస్టల్‌వద్ద భద్రత కరువు


 యువతులు ఉంటున్న ఈ వసతిగృహం వద్ద కనీస భద్రత కూడా లేదు. ఇక్కడ ఉండే యువతులందరూ పగలు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ రాత్రివేళ హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ యువతులు ఏం చేస్తారు, ఎక్కడకు వెళతారు తదితర అంశాలను ఆరా తీసేవారే లేరని సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని, రాత్రికి రాత్రే యువతులు అదృశ్యం కావడం దురదృష్టకరమని హాస్టల్‌వార్డెన్ రమాదేవి అన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా