జల్సాలకు అలవాటు పడి.. మైనర్‌లను ఉచ్చులోకి

19 Feb, 2020 13:19 IST|Sakshi
కోరంగి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సీఐ ఆకుల మురళీకృష్ణ

రూ.2.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం  

తాళ్లరేవు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు యువకుల్ని అరెస్ట్‌ చేసి జువైనల్‌ కోర్టుకు తరలించినట్లు కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. కోరంగి పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లరేవు, కాజులూరు, ఐ.పోలవరం మండలాల పరిధిలో గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఐదుగురు యువకులను జార్జిపేట వై.జంక్షన్‌ వద్ద తమ సిబ్బంది అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేల నగదు, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఓలేటి మహాలక్ష్మిరావు అలియాస్‌ మహాను ఏ1గా నమోదు చేసి అతనిపై రౌడీషీట్‌ కూడా దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఎదుర్లంక గ్రామానికి చెందిన మహాలక్ష్మీరావు కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.

అతను జల్సాలకు అలవాటు పడి అభం శుభం తెలియని మైనర్‌లను ఈ ఉచ్చులోకి లాగుతున్నాడని తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని నాలుగు కేసులకు సంబంధించి రికవరీలు చేశామన్నారు. కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఓ సుజుకీ బైక్, ఐ.పోలవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన వైన్‌షాప్‌లో జరిగిన దొంగతనం కేసులో కొంతమేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కోరంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఉప్పంగల గ్రామంలో జరిగిన దొంగతనంలో మంగళసూత్రాలు, బంగారు నెక్లెస్, బ్రాస్‌లెట్, చెవి దుద్దులు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకున్న కోరంగి ఎస్సై వై.సతీష్, ఏఎస్సై వలీ, సిబ్బంది పి.కాసురాజు, ఎన్‌వి రమణ, పి.సురేష్‌ తదితరులును అభినందించడంతో పాటు వారికి రివార్డులు అందించనున్నట్లు సీఐ తెలిపారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  
ప్రజలందరూ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు. ఇటీవల సెల్‌ఫోన్ల దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని  తమ సెల్‌ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని రాత్రి వేళల్లో తలుపులు తెరచుకుని పడుకోరాదని అన్నారు. అలాగే తీర్థయాత్రలకు, ఎక్కడికైనా వెళ్లేటపుడు సెల్‌ఫోన్‌లో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నూతన గృహాలు నిర్మించుకునేవారు తమ ఇంటివద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. సమావేశంలో ఎస్సై యడవల్లి సతీష్, ఏఎస్సై వలీ, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా