మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!

27 Sep, 2018 04:06 IST|Sakshi

     వామపక్ష తీవ్రవాద రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సిఫారసు

     వీటి ద్వారా మావోయిస్టుల ఫొటోలు, వీడియోలు రికార్డింగ్‌

     ఇటీవల సూసైడ్‌ డ్రోన్లను సమకూర్చుకున్న ఏపీ పోలీసులు

     విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పోలీసుల కొత్త వ్యూహం

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.  కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. 

పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం
దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్‌ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్‌ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. 

సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్‌ బలగాల చేతికి..
కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్‌ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్‌పీఎఫ్‌ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 

అడవుల్లోనూ వినియోగించేలా..
ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్‌ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్‌ (సూసైడ్‌ డ్రోన్‌)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు