మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం!

25 May, 2020 11:18 IST|Sakshi
తల్లిదండ్రులతో చిన్నారి రాంచరణ్‌

ఐదేళ్ల చిన్నారి గుండెకు రంధ్రం

ఆరోగ్యశ్రీలో లేని వైద్యం

మృత్యువుతో పోరాడుతున్న వైనం

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు  

కోవెలకుంట్ల: ముక్కుపచ్చలారని చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. వందేళ్లపాటు జీవించాల్సిన చిన్నారి ఐదేళ్ల వయసులోనే గుండెకు రంధ్రం పడి మృత్యువుతో పోరాడుతున్నాడు. రెండు నెలల్లో ఆపరేషన్‌ చేయకుంటే ప్రాణాపాయం కలుగుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించాలంటూ వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల పట్టణంలోని సీతారాం నగర్‌లో నివాసం ఉంటున్న రామాంజనేయులు, గురుదేవి దంపతులకు రాంచరణ్, అఖిల్‌ సంతానం. రామాంజనేయులు గౌండా పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమారుడు రాంచరణకు ఐదేళ్ల వయసు రావడంతో పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చించారు. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.

చిన్నారి గుండెకు రంధ్రం:అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్లు రాంచరణ్‌ అనారోగ్య పరిస్థితిని గుర్తించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పది రోజుల క్రితం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి గుండెకు రంధ్రం పడినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు చిన్నారిని మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా అదే సమస్య చెప్పి వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్‌కు దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. 

ఆపరేషన్‌ చేయకుంటే ప్రాణాపాయం : రెండు నెలల్లో చిన్నారి గుండెకు ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితులు తప్పవని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను బతికించుకోవడానికి గత వారం రోజుల నుంచి ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆపన్న హస్తం అందించి తమ కొడుకుని బతికించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

దాతలు సాయం చేయాల్సిన చిరునామా:
గురుదేవి: ఆంధ్రాబ్యాంకు అకౌంట్‌ నంబర్‌
080510100186893
ఐఎఫ్‌సీ కోడ్‌: ANDB0000805 కోవెలకుంట్ల  
ఫోన్‌: 9550066686,  9391026170

మరిన్ని వార్తలు