అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్‌

4 Jan, 2020 11:34 IST|Sakshi

 మూడు రోజులపాటు నిర్వహణ

సాక్షి, సూళ్లూరుపేట: మూడు రోజులపాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌–2020 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత సూళ్లూరుపేటలో తప్పెట్లు, తాళాలు, కోలాటాలు, జానపద నృత్యాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పక్షుల పండగను ప్రారంభించారు. అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్‌–2020 బెలూన్‌ ఎగురవేశారు. 

వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను మంత్రులు వరుసగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్‌ను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక పరంగా ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజంను అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పక్షుల పండగను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరావు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అటవీ శాఖ సంరక్షణాధికారి ప్రతీప్‌ కుమార్,  టూరిజం కార్పొరేషన్‌ ఎండీ ప్రవీణ్‌కుమార్, చెంగాళమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు