కోడ్‌ కూసినా తొలగని బాబు చిత్రాలు!

12 Mar, 2019 11:42 IST|Sakshi
కావలి పట్టణంలోని ప్రధాన కూడలిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఫొటోలతో ఉన్న  ప్రభుత్వ హోర్డింగ్‌లు 

సాక్షి, కావలి: నియోజకవర్గంలో చంద్రబాబు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు . ఆదివారం సాయంత్రం నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినా అధికారులు తొలగించలేదు. ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా ప్రకటించినప్పటికీ, కావలిలోని అధికారులు మాత్రం సోమవారం సాయంత్రానికి కూడా టీడీపీ నాయకుల సేవల్లో ఉంటూ నిద్రమత్తు  వీడలేదు. బాహాటంగా కనిపిస్తున్న  చంద్రబాబు చిత్రాలతో కూడిన హోర్డింగ్‌లను తొలిగించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.

దీంతో అసలు కావలిలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తేలా పరిస్థితులు ఉన్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కావలి రెవెన్యూ డివిజన్‌కు మొట్టమొదటిసారి ఐఏఎస్‌ అధికారి చామకూరు శ్రీధర్‌ను సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయన కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద, ఆయన నివాసం ఉండే బంగ్లా ఎదురుగానే చంద్రబాబు హోర్డింగ్‌లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించలేదు.

ఐఏఎస్‌కు ఎంపికై మొట్టమొదటి  పోస్టింగ్‌గా కావలి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చామకూరు శ్రీధర్‌ వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నియోజకరవర్గం సంగతి పక్కన పెడితే ఆయన కార్యాలయంతో పాటు ఆయన చుట్టూ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా చంద్రబాబు హోర్డింగ్‌లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించే పని చేయకపోవడం పట్ల అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.     
 

>
మరిన్ని వార్తలు