కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రచ్చ

31 Aug, 2013 04:33 IST|Sakshi

విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: పీఆర్పీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తున్న నేతలపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. వారి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పేరిట నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత గొడవలను మరింత రగిల్చాయి. పీఆర్పీ నుంచి వచ్చిన నేతలు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వారిపై పెత్తనం చేయడాన్ని ఇక సహించరాదని ఒక వర్గం నేతలు తీర్మానించారు.

సోనియా జన్మదిన వేడుకలు చేస్తే జనం తిడతారని చెప్పిన నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిరంజీవి జన్మదిన వేడుకులు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. అసమ్మతి నేతల సమావేశం అసలు విషయం తెలియడంతో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూసి నిష్ర్కమించారు.   సమైక్యాంధ్ర ఉద్యమానికి తామంతా మద్దతుగా ఉన్నామని ప్రజలకు సంకేతాలు పంపే ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి సేవాపీఠం పేరుతో ‘ తెలుగుజాతి గుండె చప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్’అనే నినాదంతో  మంత్రి గంటా, ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించారు.

కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాలరాజు ఫొటోలు ఈ ఫ్లెక్సీల్లో ముద్రించలేదు. ‘సమైక్యాంధ్ర పార్టీలో ఆ ఇద్దరేరీ?’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనం చూసి కాంగ్రెస్‌లోని ఒక వర్గం మండిపోయింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు వారే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేస్తున్నట్లుగా, మిగిలిన వారు చేయనట్లుగా కలరింగ్ ఇచ్చుకోవమేంటని వారు మండిపడ్డారు. ప్రభుత్వ, పార్టీ పదవుల పంపిణీ వ్యవహారంలో కొంత కాలంగా నలుగుతున్న అసమ్మతిని ఈ సందర్భంగా వారు బహిర్గతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్న పలువురు మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఒక హోటల్‌లో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

నగర పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావును కూడా సమావేశానికి ఆహ్వానించారు. అసమ్మతి మంటలు మరింత రగిలించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలియకుండా హాజరైన బెహరా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూశాక గానీ అసలు విషయం అర్థం కాలేదు. అసలు కథ ఏమిటో ఆలస్యంగా గ్రహించిన ఆయన ఆగమేఘాల మీద అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు ఫ్లెక్సీల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుబ్బరామిరెడ్డే వీటిని ఏర్పాటు చేయించారని, కాంగ్రెస్ వ్యక్తిగా ఆయన ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించడాన్ని పీసీసీకి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లు తెలిసింది.

నగర కాంగ్రెస్ మొత్తం పార్టీలు మారిన వారి చేతిలోకి వెళ్లిపోయిందని, తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి అవమానాలు, నిరాదరణ ఎదురవుతున్నాయని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ద్రోణం రాజు సత్యనారాయణ, ద్రోణం రాజు శ్రీనివాస్‌ను ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టి పనిచేసిన ఒక నాయకుడు ఇతర పార్టీ నుంచి రావడంతోనే రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడాన్ని నేతలు ఆక్షేపించారు. ఆ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాల్సి వస్తే నగరంలో ఎంతో మంది పార్టీ నేతలు ఉన్నారనే విషయం అధినాయకత్వం మరచి పోయిందని మండిపడ్డారు.

ఈ వ్యవహారాలను గట్టిగా ఎదుర్కోక పోతే మరింత నష్టపోతామని సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇక మీదట తామంతా కలసి ఒక గ్రూపుగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీలోని అంతర్గత గొడవలు, అందులోనూ ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్‌లోని ఒక వర్గం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి శుక్రవారం సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన దీక్షకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నగర ఎస్‌సీ సెల్ చైర్మన్ కొల్లాబత్తుల వెంగళరావు నేతృత్వంలో జరిగిన అసమ్మతి సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకటరావు, పేర్ల విజయచందర్, కృష్ణ, గరికిన గౌరి, జి.వి.రమణి పార్టీ నాయకులు మూర్తి యాదవ్, విజయారెడ్డి, పెద్దాడ రమణ, సుధాకర్ తోపాటు మరికొంత మంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు