కృష్ణా నదిలోకి వరద ప్రవాహం

2 Jul, 2018 04:59 IST|Sakshi

     ఆల్మట్టిలోకి 34,933 క్యూసెక్కులు 

     జలాశయంలోకి ఇప్పటి వరకూ ఇదే గరిష్ట ప్రవాహం 

సాక్షి, అమరావతి/హొసపేట : మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలోకి వరద ప్రవాహం మొదలైంది. ఆల్మట్టి జలాశయంలోకి 34,933 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ఆల్మట్టి జలాశయంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ఆల్మట్టి జలాశయానికి దిగువన ఇప్పటి వరకూ సరిగా వర్షాలు కురవకపోవడంతో కృష్ణా నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లోకి పరిగణించదగ్గ స్థాయిలో వరద ప్రవాహం చేరలేదు. మరోవైపు కర్ణాటకలో మల్నాడు ప్రాంతంలో కురస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరిగింది.

అగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి తదితర  ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో ఆదివారం ఒక్కరోజే టీబీ డ్యాంలోకి 5 టీఎంసీలకు పైగా నీరు చేరింది. దీంతో నీటిమట్టం 35.436 టీఎంసీలకు పెరిగింది. వరద ఇలాగే కొనసాగితే మరో 5 రోజుల్లో  50 టీఎంసీలకు చేరుకోవచ్చని డ్యాం అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 49,424 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 160 క్యూసెక్కులుగా ఉంది. గోదావరి నదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి 16,245 క్యూసెక్కుల ప్రవాహం రాగా డెల్టాకు 11,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగతా 4,345 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు.

చురుకుగా రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకున్నాయి. ఇవి కోస్తాంధ్రపై చురుగ్గాను, రాయలసీమపై సాధారణంగాను ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో ఉత్తరాంధ్రపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది.

వీటన్నిటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. గడచిన 24 గంటల్లో విజయనగరంలో 8, చింతపల్లి, చోడవరంలో 7, అవనిగడ్డ, విశాఖపట్నం, గరుగుబిల్లిలో 6, పోలవరంలో 5, మచిలీపట్నం, వీరఘట్టం, విజయవాడ, నర్సాపురం, పాతపట్నంలో 4, మంగళగిరి, కారంచేడు, పూసపాటిరేగ, కొయ్యలగూడెం, పలాస, బలిజపేట, తునిలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు