పొంచి ఉన్న జలగండం..

8 Aug, 2019 08:25 IST|Sakshi
తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి పరవళ్లు

తోటపల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాద స్థాయికి చేరిన వరదనీరు

నాగావళిలో భారీగా పెరిగిన నీటి ప్రవాహం

ఎనిమిది గేట్లు ఎత్తి వరద నీటిని నదిలోకి వదిలేసిన అధికారులు

సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం):తోటపల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాద స్థాయికి చేరిన వరదనీరు అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో బుధవారం నదిలో నీటి ప్రవాహం పెరిగి నాగావళి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి ప్రాజెక్టు వద్ద 103.80 మీటర్ల లెవెల్‌ ఉన్న నీటిప్రవాహం బుధవారం ఉదయం 6 గంటలకు 104.1 మీటర్లకు చేరింది. అలాగే ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలకు వరద నీరు చేరడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 6 గంటలకు 5 గేట్ల ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ప్రతి గంటకు ప్రాజెక్టు వద్ద నీటి ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టడంతో 55,511 క్యూసెక్కుల చొప్పు న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒకేలా నీటిని నదిలోకి విడిచిపెట్టారు. రాత్రికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేశామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

రెండేళ్ల తర్వాత..
రెండేళ్ల తర్వాత తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు ఇంతలా పోటెత్తిందని అధికారులు అంటున్నారు. కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నాగావళి పరవళ్లు తొక్కుతుండడంతో సమీప గ్రామ ప్రజలు ప్రవాహాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు.

అప్రమత్తమైన యంత్రాంగం
నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని తెలియడంతో వీరఘట్టం రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్, ఆర్‌.ఐ రమేష్, ప్రసాదరావు,సీనియర్‌ అసిస్టెంట్‌ షన్ముఖరావులు నాగావళి నదీ తీర ప్రాంతాలైన కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించా రు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు. నాటు పడవలను నదిలో నడపవద్దని జాలర్లను హెచ్చరించారు.

మహోగ్ర వంశధార
కొత్తూరు: ఒడిశాలోని మోహన, గుడారి, గుణుపూర్, గుమ్మడల్లో భారీగా వానలు పడుతుండడంతో వంశధారకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద గట్లు లేని కుంటిబద్ర, వసప, మాతల, అంగూరు, ఆకులతంపర, పెనుగోటివాడ, వీఎన్‌ పురం, హంస, కడుములతో పాటు గ్రామాల్లోని పంట పొలాలను నీరు ముంచెత్తింది. అలాగే మాతల–నివగాం, మదనాపురం–నివగాం, వసపకాలనీ, కుంటిభద్ర, సిరుసువాడ–కుంటిభద్ర, వీరనారాయనపురం–మాతల, అంగూరు–సోమరాజపురంల, సోమరాజపురం–ఆకులతంపర రోడ్ల మీదుగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన రహదారి అయిన పీహెచ్‌ రోడ్డు నందు మాతల వద్ద రోడ్డు మీద నుంచి వరద నీరు ప్రవహించడంతో ఒడిశా రాష్ట్రానికి వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కుంటిభద్ర శివాలయంలోకి నీరు చేరింది.

నివగాం ఎస్సీ వీధి, కొత్తవీధుల వద్ద వరద గట్టు అల్పంగా ఉన్నందున వరద నీరు నివగాంలోకి వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఐటీడీఏ పీఓ సాయి కాంత్‌ వర్మ నివగాం, మాతల, అంగూరు, వసపతో పాటు పలు వరద ప్రాంతాల్లో సందర్శించారు. వరద ఉద్ధృతి వల్ల నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నివగాం వద్ద వరద గట్టు తక్కువ ఎత్తు ఉన్నందున ఏ మాత్రం వరద నీరు పెరిగిన నివగాంలోకి వరద నీరు వస్తుందని పీవోకు వైఎస్సార్‌ సీపీ నేత పీఏసీఎస్‌ పర్స్‌న్‌ ఇన్‌చార్జి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు, టంకాల రమణరావు, కన్నయ్య సామి, దార్ల గణేష్‌ ఆచారిలతోపాటు పలువురు పీఓకు వివరించారు. ముంపు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాద్, కలమట రమేష్‌లతో పాటు పలువురు పర్యటించి వదర బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భారీగా వరద
హిరమండలం: వంశధార ఉగ్రరూపం దాల్చింది. ఒడిశాలో ఎడతెరిపి లేని వానలతో గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లకు గాను ముందుగా 19 గేట్లను ఎత్తి వేసి కిందకు నీటిని విడిచిపెట్టారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. ఉదయం ఆరు గంటల సమయానికి 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 14832 క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. ఎడమ కాలువ ద్వారా 1269 క్యూసెక్కుల నీరు, కుడికాలువ ద్వారా 458 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అయితే ఏడు గం టల సమయానికి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది గంట వ్యవధిలో 47,612 క్యూసెక్కులకు పెరిగింది.

దీంతో పూర్తిగా 22 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. సాయంత్రం 6 గంటలకు 91,054 క్యూసెక్కులకు పెరిగింది. వరద పెరగడంతో నదీ తీర గ్రామాలైన జిల్లోడిపేట ,భగీరధపురం, నీలాదేవిపురం,అక్కరాపల్లి, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండడంతో కలెక్టర్‌ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాలకొండ ఆర్డీఓ కుమార్, వంశధార ఎస్‌ఈ రంగారావులు బుధవారం బ్యారేజీని సందర్శించారు. నదీ తీర ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వంశధార వరద ఓ వైపు కొనసాగుతుండగా మహేంద్ర తనయ కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో జిల్లోడుపేట గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు. గ్రామాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు పలువురు పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేయాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యే రెడ్డి శాంతి గొట్టా బ్యారేజీని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి ఆరా తీశారు. జిల్లోడిపేట గ్రామానికి మహేంద్రతనయ నదిపై పడవ ప్రయాణం చేసి ప్రజలను అప్రమత్తం కావాలని సూచించారు. ఆమెతో పాటు గొట్టా బ్యారేజీ డీఈ ప్రభాకరరావు,తహసీల్దారు జి.సురేష్, ఎంపీడీవో ప్రభావతి, డీటీ లావణ్య ఉన్నారు.

వంశధారలో పెరుగుతున్న వరద నీరు
ఎల్‌.ఎన్‌.పేట: వంశధార నది బుధవారం ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చింది. నదిలో గంట గంటకు వరదనీరు పోటెత్తడంతో తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ఏడాది వంశధార నదిలో ఇంత ఎక్కువ స్థాయిలో వరదనీరు రావడం ఇదే మొదటిసారి. తీరంలో ఉన్న పంట పొలాలు నీట మునిగిపోగా, పండ్ల తోటల్లోకి వరదనీరు వచ్చి చేరింది. వాణిజ్య పంటలైన సారికంద పంట వరద నీటిలో మునిగిపోయింది. పం టలకు నష్టం వాటిల్లుతుందని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.

తప్పిన ముప్పు


సరుబుజ్జిలి: వంశధారలో భారీగా వరద నీరు వస్తున్నందున యరగాం ఇసుక రీచ్‌లో లోడింగ్‌ కోసం ఉంచిన 8 ట్రాక్టర్లు నీట మునిగాయి. కళా సీలు, డ్రైవర్లు ఒడ్డుకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్లను లోడింగ్‌ కోసం వరుస క్రమంలో ఉంచడంతో అన్నింటినీ వరద సమయంలో బయటకు తీసుకురావడం కుదరలేదు. ముందు వరుసలో రెండు ట్రాక్టర్లను కష్టపడి ఒడ్డుకు చేర్చారు. తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మైన్స్‌ అధికారులతోపాటు, ఆమదాలవలస సీ ఐ ప్రసాదరావు, తహసీల్దార్‌ సూరమ్మ తదితరులు ఘటనా స్థలానికి వచ్చారు. గత ఈతగాళ్లు ట్రాక్టర్లు సరిగ్గా ఎక్కడున్నాయో గుర్తించి పొక్లెయిన్ల సాయంతో వాహనాలను ఒడ్డుకు చేర్చారు.

ఆనకట్ట వద్ద నాగావళి ఉగ్రరూపం
రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలంలో రంగారాయపురం గ్రామం వద్ద నాగావళి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నది వద్ద 47,500 క్యూసెక్కుల నీరు ఆనకట్ట వద్ద నమోదైందని జేఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడ 60 వేల క్యూసెక్కుల నీరు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీరు అధికంగా ఆనకట్ట వద్దకు వచ్చి చేరడంతో కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన రెగ్యులేటర్‌ తలుపులు మూసేశారు.

తీర ప్రాంతాలు విలవిల
రేగిడి: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో బుధవారం నాగావళి నది ఒక్కసారిగా పోటెత్తింది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు నాగావళిలోకి విడిచిపెట్టారు. దీంతో నదిలో వరద ఉద్ధృతంగా ఉంది. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో మండలంలోని బొడ్డవలస, పుర్లి, కొమెర, ఖండ్యాం, కె.వెంకటాపురం గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. కె.వెంకటాపురం పాఠశాల చుట్టూ వరదనీరు చేరడంతో పాఠశాల హెచ్‌ఎం గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు కింజరాపు సురేష్‌కుమార్, వీఆర్వో రమణమూర్తి, పంచాయతీ కార్యదర్శి జగదాంబ, గ్రామస్తులు విద్యార్థులను వరద నీటిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

తహసీల్దార్‌ బి.సత్యం, ఎస్సై బి.రేవతి, ఆర్‌ఐ శ్రీనివాసరావులు నదీతీర గ్రామాలైన బొడ్డవలస, పుర్లి తదితర గ్రామాలను పరిశీలించారు. బొడ్డవలస గ్రామంలోకి వరద వచ్చే అవకాశాలు ఉండడంతో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. అవసరమనుకుంటే సంకిలి ఉన్నత పాఠశాలకు గ్రామస్తులను తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్‌ తెలి పారు. ఓపెన్‌హెడ్‌ చానళ్లు సాయన్న, తునివాడ, రేగిడి చానళ్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఇంత వరకు ఖరీఫ్‌ అంతంత మా త్రంగానే జరిగింది. ప్రస్తుతం నాగావళి నది లో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో కొంతమేర ఖరీఫ్‌ దమ్ములకు ఉపయోగపడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఐటీడీఏలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
సీతంపేట: జిల్లాలో వరదల దృష్ట్యా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, పాలకొండ, ఆమదాలవలస, హిరమండలం, బూర్జ, భామిని, కొత్తూరు, వీరఘట్టం, జలుమూరు తదితర మండలాలకు చెందిన ముంపు ప్రాంతాల వారు 08945 258331 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఐటీడీఏ పీఓ సాయికాంత్‌ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు