తీరానికి గుండె కోత

17 Jan, 2015 03:24 IST|Sakshi
తీరానికి గుండె కోత

పాలకొండ:వర్షాకాలంలో నాగావళి నది ప్రవాహం వల్ల ప్రతి ఏటా రెండు నుంచి మూడు మీటర్ల మేరకు తీరం కోతకు గురవుతోంది. నదికి ఎడమ వైపు ఉన్న పాలకొండ, బూర్జ మండలాల పరిధిలో పలు గ్రామాలను తాకుతోంది. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు కొనసాగితే వరదలు వచ్చినప్పుడు గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నదిలో ఓ వైపు ఇసుక తవ్వేస్తుండటంతో నీటి ప్రవాహం ఒకవైపునకే మళ్లిపోతూ తీరాన్ని కోతకు గురి చేస్తోంది. కొత్తగా అన్నవరం, అంపిలి, గోపాలపు రం, అల్లెన తదితర గ్రామాల వద్ద ఇసుక రీచులు ఏర్పా టు చేయనుండటంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 తోటపల్లి రిజర్వాయర్ నుంచి శ్రీకాకుళం వరకు నాగావళి ప్రవహిస్తోంది. గతంలో నది మధ్య భాగం నుంచే ప్రవాహం కొనసాగేది. వరదల సమయంలో ఇసుక మేటలు వేయడంతో కాలక్రమంలో వీటిని అధికారులు ఇసుక రీచులుగా గుర్తించి తవ్వకాలకు అనుమతిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో లోతు పెరిగి నదీ గమనం అటు మళ్లిపోతోంది. ఈ క్రమంలో నదికి ఎడమ వైపున ఉన్న వీరఘట్టం మండలంలో 12 గ్రామాలు, పాలకొండ మండలంలోని 8 గ్రామాలు, బూర్జ మండలంలో 6 గ్రామాలు, ఆమదాలవలస మండలంలో 14 గ్రామాల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది. ప్రతి ఏటా కోత పెరుగుతూ గ్రామాలకు, నదికి మధ్య ఉన్న దూరం తరిగిపోతుండటంతో వరద ముప్పు పెరుగుతోంది.
 
 రీచులతో అనర్థాలు
 ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఈ నాలుగు మండలాల పరిధిలో సుమారు 15 రీచులను గుర్తించింది. వీటిలో ఇసుక తవ్వకాలు చేపడితే నదీ వేగం మరింత పెరిగి పూర్తిగా గ్రామాలను ఆనుకొని ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే నదీ తీర గ్రామాల ప్రజలు ఇసుక రీచుల వేలాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రమాదానికి అతి సమీపంలో ఉన్నామని, ఇప్పుడున్న ఇసుక దిబ్బలను కూడా తవ్వేస్తే గ్రామాలు కొట్టుకుపోతాయని అంపిలి గ్రామానికి చెందిన లోలుగు విశ్వేశ్వరరావు, గండి రామినాయుడు తదితరులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్టు వివరించారు.
 
 భూముల్లో ఇసుక మేటలు
 మరోవైపు నదికి కుడి భాగంలో ఉన్న రేగిడి మండలం సంకిలి, బొడ్డవలస గ్రామాల వద్ద పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తున్నాయి. గతంలో చెరుకు, వేరుశనగ పంటలు పండే పొలాలు ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయాల్లో ప్రవాహం దిశ మారి పంట పొలాల పైకి వస్తోందని, ఇసుక మేటలు పేరుకుపోయి భూములు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 నిలిచిన కరకట్టల నిర్మాణాలు
 వరద ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు నిర్మించ తలపెట్టిన కరకట్టల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాల మధ్య కనీసం గట్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. దీని ప్రభావంతో నదిలో ప్రవాహం 60 వేల క్యూసెక్కులు దాటితే నదీ తీర గ్రామాలు మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు