వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం

19 Aug, 2018 08:38 IST|Sakshi
రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రంలో వరద బాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. గోదావరి లంక గ్రామాల్లోని ప్రజలను అల్‌కాట్‌ గార్డెన్స్‌ కార్పొరేషన్‌ కల్యాణమండపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆ పునరావాసకేంద్రాన్ని కలెక్టర్‌ శనివారం పరిశీలించారు.  బాధితులకు అందుతున్న భోజనాలు, పాలు, బ్రెడ్‌ విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

వారికి ఆహారంతోపాటు గుడ్లను కూడా అందించాలని అధికారులకు సూచించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఎప్పటికప్పడు బాధితుల ఆరోగ్యాన్ని పరిశీలించి అవసరమైన మందులు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట నగరపాలక సంస్ధ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ ఉన్నారు.  

ఏడు పునరావాస కేంద్రాల ఏర్పాటు
గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున జిల్లా వ్యాప్తంగా 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు  కలెక్టర్‌ కార్తి్తకేయ మిశ్రా వెల్లడించారు. ఆయన శనివార ం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వరద పరిస్థితుల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడు పునరావాస కేంద్రాల్లో మొత్తం 832 మంది తలదాచుకున్నట్టు ఆయన తెలిపారు. అమలాపురం డివిజన్‌ పరిధిలో 4 పునరావాస కేంద్రాలను, రాజమహేంద్రవరం పరిధిలో 2 పునరావాస కేంద్రాలు, రంపచోడవరం డివిజన్‌లో 1 పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 

రాజమహేంద్రవరం పరిధిలో ఒక గ్రామం, రంపచోడవరంలో 2 గ్రామాలు, ఎటపాక ప్రాంతంలో 17 గ్రామాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు.  వరదబాధిత ప్రాంతాల్లో మెకనైజ్డ్‌ బోట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వచ్చే వారంలో శబరి బేసిన్లో వర్షాలు కురుస్తాయనే సమాచారం ఉండడంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం గోదావరి ఉధృతి ఎగువ ప్రాంతాల్లో తగ్గిందన్నారు. విలీన మండలాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేసినట్టు అయన తెలిపారు.

 శనివారం ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.6 అడుగులు, రంపచోడవరం ప్రాంతంలో 47.2 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద 14.6 అడుగుల నీటి మట్టం నమోదు అయినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌ కుమార్, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, అర్బన్‌ ఎస్పీ íషిమోషి బాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు