చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరే అవకాశం

16 Aug, 2019 08:36 IST|Sakshi

నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లోకి 8.78 లక్షల క్యూసెక్కుల నీరు

సాగర్‌ నుంచి దిగువకు 7.34 లక్షల క్యూసెక్కులు

దీంతో లంక గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంకలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

సాక్షి, అమరావతి:  జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లోకి  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి  8.78 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 7,34,967 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ వద్ద గేట్లనుంచి  పాలపొంగులా వెలుపలికి వస్తున్న నీటని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున  వస్తున్నారు.  సాగర్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ జాం  అవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకులోకి 5,46,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు  5,98,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజిలోకి గురువారం సాయంత్రకు 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే పరిమాణంలో 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. ప్రకాశం బ్యారేజికి లోకి వచ్చే వరద పెరుగుతుందని, దిగువకు 6 లక్షల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజి వద్దకు 7.5 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తుళ్లూరు, కొల్లూరు, కొల్లిపర మండలాల్లోని లంక గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
 
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు

తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొల్లిపర మండలం కరకట్ట లోపల ఉన్న బొమ్మువానిపాలెం, కొత్తూరిలంక, అన్నవరపు లంక లోని  ప్రజలను గురువారం సాయంత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రెవెన్యూ, పోలీసు సిబ్బంది  తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పిడపర్తివారిపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరపు లంక , కొల్లిపర, వల్లభాపురం గ్రామాల్లో 450 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పసుపు, అరటి, కంద, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. కొల్లిపర  మంలంలోని తుగ్గనలంక, చింతర్లంక, గాజులంక, ఆవులవారిపాలెం, పొతర్లంక గ్రామాల్లో 400 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నీట మునిగిన వాటిలో  కంద, పసుపు, మొక్కజొన్న, అరటి, కూరగాయలు  వంటి  ఉన్నాయి. దొనేపూడి–పొతర్లంక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి.  ప్రకాశం బ్యారేజి నుంచి శుక్రవారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారనే సమాచారంతో  లంక గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు.

నిండుకుండలా జలాశయాలు.....
నాగార్జున సాగర్‌ రిజార్వాయర్‌లో గురువారం సాయంత్రానికి 586.70 అడుగులు అంటే, 303.94 టీఎంసీలుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం 170.44 అడుగులు కాగా, ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి  39 టీఎంసీల నీరు ఉంది.  ప్రకాశం బ్యారేజి నుంచి 70 గేట్లు ఎత్తి, గురువారం రాత్రి 6 లక్షల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

అప్రమత్తం చేశాం...
కృష్ణానదికి వరద కొనసాగుతూనే ఉంది. దీంతో తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం.  శుక్రవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజికి 7.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజి దిగువ ఉన్న లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో  రెవెన్యూ. పోలీసు సిబ్బంది ప్రజలతో చర్చించి, వారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. 
- ఐ.శ్యామూల్‌ అనందకుమార్, కలెక్టర్, గుంటూరు

మరిన్ని వార్తలు