‘నారింజ’ తరలిపోతోంది

13 Nov, 2013 23:49 IST|Sakshi

 జహీరాబాద్, న్యూస్‌లైన్:  మన ‘నారింజ’ జలం కర్ణాటక రాష్ట్రానికి వరమవుతోంది. జహీరాబాద్ ప్రాంతంలోని వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేక పోవడంతో కర్ణాటక ప్రాంతానికి వృథాగా తరలిపోతోంది. ఈ సంవత్సరం సుమారు 2 టీఎంసీల మేర వరద నీరు కర్ణాటక ప్రాంతానికి తరలిపోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం బిలాల్‌పూర్ గ్రామంలో పుట్టిన నారింజ వాగు,  జహీరాబాద్ మీదుగా ప్రవహిస్తూ చిరాగ్‌పల్లి వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నియోజకవర్గంలో సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ వాగు ప్రవహిస్తున్నా, నీటిని సద్వినియోగం చేసుకునే దిశలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోక పోవడంతో నీరంతా పక్క రాష్ట్రానికి తరలిపోతోంది.
 ఇక్కడ వృథా..అక్కడ వినియోగం
 నారింజపై మన సర్కార్ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో కర్ణాటక రాష్ట్రం ఈ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. బీదర్ జిల్లా హలికేడ్ గ్రామం సమీపంలో నిర్మించుకున్న కరంజా ప్రాజెక్టు నిర్మించి ఆ రాష్ట్ర  రైతులకు సాగునీరందిస్తోంది. మన రాష్ట్రంలోని నారింజ వాగును కర్ణాటక వాసులు కరంజగా పిలుస్తారు. 1971లో కరంజా వాగుపై కర్ణాటక ప్రభుత్వం అక్కడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును నిర్మించింది. అక్కడి సాగునీటి అధికారులు జహీరాబాద్ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి కోసం వర్షాకాలం ప్రారంభం నుంచే కరంజా ప్రాజెక్టు నీటి పారుదల శాఖ అధికారులు ఎదురు చూస్తుంటారు. జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టులో నీటి పరిస్థితిని ఎప్పటి కప్పుడు ఆరా తీస్తుంటారు.

ప్రాజెక్టు సామర్థ్యం 12 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7 టీఎంసీల నీరు కరంజా ప్రాజెక్టులో ఉంది. ఇందులో సగం నీరు మన ప్రాంతం నుంచి వెళ్లినవే. ఈ నీటితోనే అక్కడి రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి రైతులు మాత్రం సాగునీటి కోసం తండ్లాడుతున్నారు.
 రూ.కోటి వృథా
 నారింజ వాగు జహీరాబాద్ ప్రాంతంలోనే పుట్టినా ఇక్కడి ప్రజలకు ఉపయోగించుకుంటున్న జలాలు మాత్రం చాలా తక్కువ. వృథాగా కర్ణాటక ప్రాంతానికి తరలుతున్న జలాలను కొంత మేర సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు(బి) గ్రామ శివారులో గల నారింజ వాగుపై 1970 సంవత్సరంలో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. 1971లో కాలువ తూమును ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు కింద 3వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అధికారులు అప్పట్లో ప్రతిపాదించారు. ఆ తర్వాత కాలంలో దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నారింజ జలాలతో ఒక్క ఎకరం కూడా తడవడం లేదు.  నారింజ ప్రాజెక్టు సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ) కాగా, ప్రాజెక్టులోకి వచ్చి చేరే వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వయర్ మైళ్లుగా అధికారులు గుర్తించారు. గరిష్ట వరద నీటి ప్రవాహాన్ని 41.800 క్యూసెక్కులుగా నిర్ధారించారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో అవసరం మేరకు భూమిని సేకరించి నష్టపరిహారం అందించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు కోటి రూపాయల నిధులు కూడా ఖర్చు చేశారు. ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణం సక్రమంగా చేపట్టక పోవడంతో నాలుగు దశాబ్దాలుగా ప్రాజెక్టు నీరు సాగుకు ఉపయోగపడడం లేదు. ప్రాజెక్టు ఎడమ కాలువతో 2,450 ఎకరాలు, కుడి కాలువ కింద 550 ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా గుర్తించినప్పటికీ ఆ భూములకు నారింజ జలం చేరడం లేదు.
 అదనపు జలాలపై శ్రద్ధ చూపని పాలకులు
 నారింజ వాగు పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం అనువైన ప్రాంతాలున్నా ఈ దిశలో ప్రభుత్వం, పాలకులు ప్రయత్నించడం లేదు. ఇది జహీరాబాద్ ప్రాంత రైతులకు శాపంగా మారింది. తగినన్ని చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా భూగర్భ జలాలను వద్ధి చేసుకునే వీలున్నా సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయలేదు. మరోవైపు కర్ణాటక వెళుతున్న వృథా జలాలను సింగూరు ప్రాజెక్టులోకి మళ్లించాలనే ప్రతిపాదన ఉన్నా, అది కూడా మరుగున పడింది. అదనపు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరం మేరకు వరుస క్రమ చెక్‌డ్యాంలను నిర్మించాలని జహీరాబాద్ ప్రాంత రైతులు, ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు