కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి

2 Aug, 2014 02:16 IST|Sakshi
కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి

శ్రీశైలానికి భారీగా వరద నీరు
తుంగభద్ర డ్యాంలో పది క్రస్టుగేట్ల ఎత్తివేత

 
బెంగళూరు/ధరూరు/శ్రీశైలం/విజయపురిసౌత్/హోస్పేట: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఫలితంగా జూరాలకు, అక్కడినుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఆల్మట్టిలోకి ఇన్‌ఫ్లో లక్షా మూడు వేల 406 క్యూసెక్కులుండగా.. లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే సమయంలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 20 క్రస్టుగేట్లను ఎత్తి లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి మరింత పెరిగింది. ప్రాజెక్టుకు లక్షా 20 వేల 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 22 క్రస్టుగేట్లు ఎత్తి లక్షా 24 వేల 759 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

ఇక్కడి జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో పూర్తిస్థాయిలో 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 59.5145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 838.40 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం శనివారం ఉదయానికి 845 అడుగులకు చేరే అవకాశముంది. వరదనీటి రాక ఇదేరీతిలో కొనసాగితే మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం నీటిమట్టం పూర్తిస్థాయిలో 890 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. అనంతరం ఇక్కడినుంచీ సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుదుత్పాదన అనంతరం 14,194 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర గేట్ల ఎత్తివేత: మరోవైపు తుంగభద్ర డ్యాం నిండడంతో శుక్రవారం పూజలు నిర్వహిం చిన అధికారులు పది గేట్లు పైకి ఎత్తి దిగువకు 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.    
 
 

మరిన్ని వార్తలు