ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక

5 Aug, 2019 10:53 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్‌వే పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు

సాక్షి, పశ్చిమగోదావరి : గోదావరిలో వరద ఉగ్రరూపు దాల్చింది. ఐదు రోజుల నుంచి ఏజెన్సీలో 19 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రాన్ని గోదావరి వరద ముంచెత్తింది. క్షేత్రంలో రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. వందలాది ఎకరాల్లో లంకభూముల్లో పంటలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనగాయలంక కాజ్‌వేపై నుంచి నాలుగు అడుగుల మేరకు వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడ పడవలు ఏర్పాటు చేసి జనాన్ని ఒడ్డుకు చేర్చుతున్నారు. పెరవలి మండలంలో కానూరు, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు, మల్లేశ్వరం, ఖండవల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు వరదనీట మునిగాయి. కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం, నిడదవోలు, పెనుగొండ మండలాల్లోను లంకభూములు ముంపుబారిన పడ్డాయి.

ఏజన్సీలో పోలవరం, వేలేరుపాడు మండలాల పరిధిలో 39 గ్రామాలకు ఐదు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలో వరద నెమ్మదిస్తుండడంతో ఉదయం పది గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి 14.10 నుంచి నిలకడగా కొనసాగింది. ఒంటిగంటకి 14.20 అడుగులకు పెరిగింది. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను పూర్తిగా ఆల్‌ క్లియర్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆనకట్ట నుంచి 13,50,363 క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో వరద ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు స్ధిరంగా కొనసాగుతోంది.

పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతంలో భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ కాళేశ్వరం, దుమ్ముగూడెం, పేరూరు తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో వరద ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,800 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4వేలు, సెంట్రల్‌కి 1,800లు, పశ్చిమ డెల్టాకు 2వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడిచి పెడుతున్నారు.

ముంపులోనే పంటపొలాలు
డెల్టాలో గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో ఇంకా 4,746 హెక్టార్ల పంట ముంపులోనే ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. 591 హెక్టార్లలో వరి నారుమళ్లు ముంపు బారిన పడితే దీనిలో 412 హెక్టార్ల నారుమళ్లు కుళ్లిపోయాయన్నారు. 7,550 మంది రైతులకు చెందిన 1,026 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంపులో ఉన్న పంటలు తేరుకుంటే నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అ«ధికారులు చెబుతున్నారు. పెరవలి మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది.  మిగిలిన తీర ప్రాంత మండలాల్లో సుమారు రెండు వందల ఎకరాల పంట నీటమునింది.

ముంపు ప్రాంతాల్లో మంత్రి, ఎంపీ పర్యటన
ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్‌ కలెక్టర్‌ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లంక గ్రామాల్లో పునరావాసం కేంద్రాలు  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దమల్లం లంక, అయోధ్యలంక, రవిలంక, మర్రిమూల, పుచ్చలలంక గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

39 గ్రామాలకు రాకపోకలు బంద్‌
గోదావరి వరద ముంచెత్తడంతో పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద బాధితుల కోసం పోలవరం, వేలేరుపాడు గ్రామాల్లో రెండు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 51 కుటుంబాలకు చెందిన 133 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్‌ వరద పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఇన్‌చార్జ్‌ మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌లు ముంపు ప్రాంతంలో పర్యటించారు. ముంపు ప్రభావిత గ్రామాలకు ప్రజలకు అవసరమైన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి ముందుస్తు ఏర్పాట్లు చేశారు.

ముంపు ప్రాంతంలో 4,088 కుటుంబాలకు అధికారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 1,022 క్వింటాళ్ల బియ్యం, బంగాళ దుంపలు, ఉల్లిపాయాలు, 4,088 లీటర్ల పామాయిల్, 8,716 లీటర్ల కిరోసిన్, 4,188 కేజీల కందిపప్పు అందజేశారు. 56 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలో 53 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,156 మందికి వైద్య సేవలు అందజేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 13 డెంగీ, డయేరియా కేసులకు వైద్యం చేశామన్నారు. ముంపు గ్రామాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, క్లోరిన్‌ మాత్రలతో పాటు అన్ని రకాలైన మందులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు