ముంచేసిన ఎర్రకాలువ

23 Aug, 2018 06:51 IST|Sakshi
నిడదవోలు పట్టణ శివారు గాంధీనగర్‌లో ఇళ్ల చుట్టూ చేరిన వరదనీరు

జలదిగ్బంధంలో కంసాలిపాలెం

సింగవరం, తాళ్లపాలెం జలమయం

10,300 ఎకరాల్లో పంట నీటమునక

పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్‌: ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చి పల్లెలను, పంటపొలాలను నీట ముంచేసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరదనీరు ప్రళయం సృష్టిస్తోంది. నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం, రావిమెట్ల, శంకరాపురం, సింగవరం, తాళ్లపాలెం గ్రామాల్లోని పంటపొలాలు, రోడ్లపై 4 అడుగుల ఎత్తున వరద నీరు చేరింది. గత మూడు రోజులుగా భారీగా వరదనీరు చేరడంతో 10,300 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కంసాలిపాలెం– మాధవరం, సింగవరం–కంసాలిపాలెం, మాధవరం–కంసాలిపాలెం మధ్య రాకపోకలు స్తంభించాయి. కంసాలిపాలెం గ్రామ ప్రజలు ఎటూ వెళ్లే దారిలేకపోవడంతో  జలదిగ్బంధంతో తల్లడిల్లుతున్నారు. మంగళవారంరాత్రి శెట్టిపేట రైల్వే బ్రిడ్జి వద్ద నీరు చేరడంతో తాడేపల్లిగూడెం వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. జలవిద్యుత్‌ కేంద్రం నీటమునిగింది. శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా కాలువలోకి ఎర్రకాలువ నీరు చేరుతోంది.

సింగవరం, తాళ్లపాలెం గ్రామాల్లోని పలు కాలనీల చుట్టూ వరదనీరు చేరి బయటకు అడుగువేయలేని పరిస్థితి. నిడదవోలు–యర్నగూడెం ప్రధాన రోడ్డుపై బుధవారం భారీగా నీరు చేరడంతో తిమ్మరాజుపాలెం, సూరాపురం, కాటకోటేశ్వరం, తాడిమళ్ల, కోరుమామిడి, యర్నగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం ఎత్తడంతో పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, విజ్జేశ్వరం, అమ్మేపల్లి, కోరుమామిడి, ఉనకరమిల్లి, రావిమెట్ల, సింగవరం, జె.కండ్రిగ, కంసాలిపాలెం, తాళ్లపాలెం గ్రామాల పరిధిలోని వరి, చెరకు, అరటి, కూరగాయల పంటలు, ఇటుక బట్టీలు నీటమునిగి రైతులు భారీగానష్టపోయారు. తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకివరదనీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతనంగా నిర్మించిన తొమ్మిది అడుగుల రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమాల ఏర్పాట్ల పనులకు ఆటంకం కలుగుతోంది. కంసాలిపాలెం గ్రామం చుట్టూ నీరుచేరడంతో గ్రామస్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారని,ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉపసర్పంచ్‌ కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు