స్థిరంగా ‘కృష్ణమ్మ’

13 Jul, 2020 04:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆల్మట్టిలో 95.5 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

జూరాలలో గరిష్ట స్థాయికి చేరిన నిల్వలు

ప్రకాశం బ్యారేజీ నుంచి 8,591 క్యూసెక్కులు కడలిలోకి.. గోదావరిలో నిలకడగా వరద

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి ఆదివారం 69,868 క్యూసెక్కులు చేరుతున్నాయి. డ్యామ్‌లో నీటి నిల్వ 95.5 టీఎంసీలకు చేరడంతో.. విద్యుత్‌ ఉత్పత్తి పెంచి 36 వేల క్యూసెక్కులకుపైగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 39,720 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 33.47 టీఎంసీలకు చేరింది. మరో 4 టీఎంసీలు వస్తే నారాయణపూర్‌ నిండుతుంది. మంగళవారం నారాయణపూర్‌ గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను వదిలే అవకాశం ఉంది.  

తుంగభద్రలో తగ్గింది 
► తుంగభద్రలో వరద కొంత తగ్గింది. డ్యామ్‌లోకి 24,497 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 20.32 టీఎంసీలకు చేరింది.  
► కృష్ణా నది నుంచి జూరాల ప్రాజెక్టులోకి 4,130 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.01 టీఎంసీలకు చేరింది. జూరాల నిండాలంటే మరో 1.5 టీఎంసీలు అవసరం. జూరాల నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750.. భీమా ఎత్తిపోతల ద్వారా 650 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. 
► శ్రీశైలం జలాశయంలోకి 2,557 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 37.25 టీఎంసీలకు చేరింది. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో మరో ఐదారు రోజుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉంది. 
► శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల నాగార్జున సాగర్‌లోకి 1,202 క్యూసెక్కులు చేరుతుండగా.. ఏఎమ్మార్పీ ద్వారా 500 క్యూసెక్కులు, విద్యుత్కేంద్రం ద్వారా 460 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 1,390 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 7.43 టీఎంసీలకు చేరింది.  
► మున్నేరు, కట్టలేరు, వైరా వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి వరద జలాలు చేరుతున్నాయి. 16,316 క్యూసెక్కుల ప్రవాహ జలాలు వస్తుండగా.. డెల్టా కాలువలకు 7,725 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 8,591 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. 

నిలకడగా గోదారమ్మ.. 
► గోదావరి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 3,100 క్యూసెక్కులను విడుదల చేసి 1,20,022 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. 
► వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి 3,987 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 3,693 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా