ఫ్లవర్‌ షో దగ్గర తగ్గని సందడి

30 Dec, 2019 20:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫ్లవర్‌ షోను చూడటానికి మూడో రోజు కూడా జనం పోటెత్తారు. డా. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సెంట్రల్‌ పార్క్‌లో ఫ్లవర్‌ షో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా రెండురోజులు మాత్రమేనని ప్రకటించినప్పటికీ విశాఖ నగర వాసుల సౌకర్యార్థం ఫ్లవర్‌ షోను మరో రోజు పొడిగించారు. దీంతో పుష్ప సోయగాలను వీక్షించడానికి విశాఖవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు రూ. 60 లక్షల వ్యయంతో ముంబై, కోల్‌కతా, హిమాచల్‌ ప్రదేశ్‌, బెంగళూరు ప్రాంతాల నుంచే కాకుండా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ధాయిలాండ్ వంటి ఇతర దేశాల నుంచి సైతం పూలను తెప్పించారు. 15 టన్నుల వివిధ పుష్పాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మిక్కీమౌస్‌, నెమలి వివిధ రకాల ఆకృతులు పర్యాటకుల మనసును దోచుకున్నాయి. ఫ్లవర్‌ షోలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్ట్స్‌, లిలియమ్స, టులిప్స్‌, బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌, టెలికోనియా వంటి అరుదైన జాతి పువ్వులను చూసి విశాఖ వాసులు ఆనంద పరవశులయ్యారు. వాటి దగ్గర సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మరోవైపు ఫ్లవర్‌ షో సమీపంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ కలర్‌ ఫౌంటైన్‌ ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు