‘స్వైన్‌ఫ్లూ’పై అప్రమత్తం

11 Sep, 2015 02:40 IST|Sakshi
‘స్వైన్‌ఫ్లూ’పై అప్రమత్తం

చిత్తూరు (అర్బన్): విశాఖపట్టణం, తెలంగాణ ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ ప్రబలడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమయ్యింది. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించినా, ఎవరికైనా వ్యాధి సోకినా సరైన చికిత్స చేయించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటుచేసింది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, కుప్పం, మదనపల్లె, పలమనేరు, నగరి ఏరియా ఆస్పత్రులు, పీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతాల్లో చిన్నపిల్లల వైద్య నిపుణులతో పాటు అందుబాటులో ఉన్న ఫిజీషియన్, అనస్తీషియా వైద్యులు ఉండాల్సిందిగా డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరి ఆదేశాలు జారీచేశారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, వ్యాధి నిర్ధారణ కోసం నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆదేశాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో తిరుపతి వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు శ్రీధర్, శంకర్‌రెడ్డి, జనార్దన్‌రాజు, కిరీటీని నియమించారు. అవసరమైన చోట ఈ బృందం పర్యటించి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారిని పరిశీలిం చి వారి అభిప్రాయాలను తెలియచేస్తుంది. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రైవేటు ఆస్పత్రులకు సైతం ఆంక్షలు విధించారు. రోగి నుంచి సేకరించే స్వాబ్‌ను రెండు నమూనాలు సేకరించాలని జిల్లా వైద్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది. స్వాబ్‌లో ఒక దాన్ని ప్రైవేటు ఆస్పత్రులే పరిక్షీంచుకోవచ్చు. మరోదాన్ని హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసెన్ (ఐపీఎం)కు పంపాలని సర్కులర్‌లో పేర్కొంది. అక్కడ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేసి వ్యాధి సోకితే సమాచారాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులకు తెలియచేస్తారు.

 అందుబాటులో మాత్రలు
 ఇక ఈ వ్యాధి సోకితే అందించే ప్రధాన మాత్రలు టామీఫ్లూ. ఇప్పటికే జిల్లాలో 1700 మాత్రల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాల సీజన్ కావడంతో ఒకవేళ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తే మాత్రల కొరత లేకుండా చూసుకోవడానికి అదనంగా 2 వేల టామీఫ్లూ మాత్రలు కావాలని వైద్యశాఖ అధికారులు రాష్ట్ర కమిషనరుకు లేఖ రాశారు.
 
 ముందు జాగ్రత్త అవసరం

 స్వైన్‌ఫ్లూపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రజలు సైతం విడవని జలుబు, దగ్గు, ముక్కులోంచి ద్రవం కారుతూనే ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకెళ్లాలి. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీగా ఉన్న ప్రాంతాలకు యాత్రలకు వెళ్లకపోవడం మంచిది.  వైద్యుల్ని అందుబాటులో ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
 - డాక్టర్ కోటీశ్వరి,
 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి
 
 

>
మరిన్ని వార్తలు