కోళ్ల పరిశ్రమపై ఫ్లోరైడ్‌ దెబ్బ

17 Nov, 2018 13:16 IST|Sakshi

నీటి వసతి లేక చుట్టు ముడుతున్న వ్యాధులు

భారీగా నష్టపోతున్న రైతులు

భారంగా మారిన కోళ్ల ఫాంల నిర్వహణ

మార్కాపురం డివిజన్‌లో కోళ్ల ఫాంలపై అనాసక్తి

ప్రకాశం, మార్కాపురం టౌన్‌: రైతులు వ్యవసాయం తరువాత ఎక్కువగా పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాల నిర్వహణపై ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం జిల్లాలో కోళ్లఫారాల నిర్వహణ చేయలేక చేతులేత్తేస్తున్నారు. మార్కాపురం డివిజన్‌లో నీటిలో ఫ్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో కోళ్ల ఫారాల నిర్వహణ కష్టంగా ఉందని, ఈ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నీరు వస్తే రైతులకు, వ్యాపారులకు కొంత మేర వ్యాపారం లాభసాటిగా మారవచ్చని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ కష్టతరంగా మారటం, ప్రకృతి నుంచి అవసరమైన సహకారం లేకపోవటం, నీటిలో ఫ్లోరిన్‌ శాతం ఉండటంతో కోళ్లకు రాడికల్‌ డిసీజెస్‌లో భాగంగా కొక్కెర వ్యాధులు వచ్చి భారీగా నష్టం వాటిల్లడం, కూలీల వేతనాల భారం, షెడ్లు, దాణా ఖర్చులు అధికం కావటంతో వీటి నిర్వహణపై ఆసక్తి కోల్పోతున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డివిజన్‌లో బాయిలర్, లేయర్లు, నాటుకోళ్ల పెంపకం సుమారు 25 నుంచి 30 వరకు ఫారాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీనితో చికెన్‌ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి లైవ్‌ చికెన్‌ పేపర్‌ ధరను బట్టి కొనుగోలు చేసి విక్రయించుకుంటున్నారు. ఒక్క మార్కాపురం పట్టణంలోనే రోజుకు 600 నుంచి 1000వరకు, ఆదివారం వీటి సంఖ్య 5వేల వరకు కోళ్లను దిగుమతి చేసుకుని విక్రయాలు చేసుకుంటుంటారు. మరికొందరు చిన్నపాటి షెడ్లలో కోళ్లను నిల్వ ఉంచుకుని విక్రయానికి వినియోగించుకుంటుంటారు.

కోళ్లఫారాల నిర్వహణ ఇలా...
కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా షెడ్‌ను తయారు చేసుకోవాలి. లేకుంటే షెడ్‌ను సదరు యజమానులు కేజి కోడికి రూ.2 ప్రకారం ఎన్ని కోళ్లు పెంచుకుంటే అంత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కోళ్ల ఫారంలో కూలీలు జతకు నెలకు సుమారు 10వేల రూపాయల వరకు జీతంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్, నీటి సౌకర్యంకు వాడకాన్ని బట్టి చెల్లిస్తుంటారు. బాయిలర్‌ కోళ్లలో పిల్ల విక్రయం నుంచి కేజికి వచ్చే నాటికి దాణా, ఖర్చుల రూపంలో 80రూ వరకు వస్తుంది. దీని ప్రకారం 2కేజీల కోడి తయారయ్యేందుకు రైతుకు 160రూ ఖర్చు అవుతుంది. లేయర్లకు అయితే పిల్ల 30రూ ధర పలుకుతుండగా, గుడ్లకు వచ్చే వరకు 4నెలల 15రోజుల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది కాలం వరకు పడుతుంది. గుడ్లు పెట్టే వరకు ఒక్కొక్క కోడిపై రూ.600 ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు. దీనితో మార్కెట్‌ ధరను బట్టి కోడి గుడ్ల ధర హెచ్చుతగ్గులు ఉండటంతో ఒక్కొక్కసారి లాభం, నష్టాలు రావచ్చని పేర్కొంటున్నారు. లేయర్ల పెంపకం డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 నుంచి 4సాగులో ఉన్నట్లు సమాచారం. గుడ్లకు వచ్చే దశలో ధర తగ్గితే రైతు ఆర్ధికంగా ఇబ్బందులు పడక తప్పదని పలువురు నిర్వాహకులు పేర్కొంటున్నారు.

కోళ్లకు వచ్చే వ్యాధులతో తీవ్ర నష్టం..
కోళ్ల పెంపకంలో రైతు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధులు సోకినప్పుడు భారీగా కోళ్లు చనిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోళ్లకు బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్, విటమిన్, మినరల్స్‌ లోపించినా వ్యాధులు సోకే అవకాశం ఉంది. కోళ్లు తీసుకునే నీటిలో ఫ్లోరిన్‌ ఉంటే వాటర్‌ శానిటేషన్‌ వాడకుంటే క్రమణే కొక్కెరవ్యాధి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అప్రమత్తం కాకపోతే కొక్కెరవ్యాధి వ్యాప్తి చెంది వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందే అవకాశం ఉంటుంది. కోడి పెంపకం నుంచి విక్రయించే వరకు రెండు సార్లు వ్యాక్సిన్లను వేయాల్సి ఉంటుంది. కోళ్ల నిర్వహణలో రైతుకు, వ్యాపారికి అనుభవం ఉంటే వీటి నిర్వహణ చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. ఇలా కోళ్ల పెంపకాన్ని చేపట్టిన అనేక మంది రైతులు, వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయి కోళ్ల ఫోరాలు ఎత్తేసిన సంఘటనలు కూడ ఎక్కువగా ఉన్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి ఇలా...
మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల వ్యాపారులు కోళ్లను ఆరోజు మార్కెట్‌ ధరను బట్టి కొనుగోలు చేస్తుంటారు. మార్కాపురం పరిసరాల్లో లభించే కోళ్లతో పాటు ఇతర ప్రాంతాలైన చిత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. మరికొందరు అధిక మొత్తంలో కోళ్లను కొనుగోలు చేసి తాత్కాలికంగా షెడ్లలో నిల్వ ఉంచుకుంటుంటారు.

మరిన్ని వార్తలు