నిడమానూరు వరకు ఫ్లై ఓవర్‌ పొడిగింపు

30 Sep, 2018 11:33 IST|Sakshi

 కలెక్టర్‌ లక్ష్మీకాంతం

 రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకారం 

చిలకలపూడి(మచిలీపట్నం): విజయవాడ బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పొడిగించనున్నట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం శనివారం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు బెంజ్‌సర్కిల్‌  ఫ్లై ఓవర్‌ను స్క్రూ బ్రిడ్జి నుంచి రమేష్‌ హాస్పిటల్‌ సెంటరువరకు నిర్మించాలని తొలుత భావించామన్నారు. రాజధాని ప్రాంతం దగ్గర ఉండటం, ట్రాఫిక్‌ పెరుగుదల, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. 

రహదారిని విస్తరించాలంటే రూ. 2 వేల కోట్లు సుమారుగా వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని నిడమానూరు గ్రామం వరకు పొడిగిస్తే కొంత ట్రాఫిక్‌ను నియంత్రించవచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. అమరావతి రాజధాని నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ఫ్లై ఓవర్‌ పొడిగింపు లేదా రహదారి విస్తరణ కార్యక్రమం చేపట్టాల్సి ఉందని తెలిపారు. 

అయితే రహదారి విస్తరణకు అధిక వ్యయం అవుతున్న నేపథ్యంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పొడిగిస్తే రూ. 500 కోట్లతో సరిపోతుందని కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని నిధులు ఇచ్చేందుకు అంగీకరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయితే బెంజ్‌సర్కిల్, రమేష్‌ హాస్పిటల్‌ సెంటర్, రామవరప్పాడు సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు