షాడో బృందాలు.. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు!

6 Feb, 2014 03:15 IST|Sakshi
షాడో బృందాలు.. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు!

* ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ నియంత్రణకు ఈసీ చర్యలు
* ప్రత్యేక బ్యాంక్ ఖాతా, చెక్కుల ద్వారానే లావాదేవీలు
* పరిమితి మించితే క్రిమినల్ కేసులు
* పెయిడ్ న్యూస్ నిర్ధారణకు కమిటీలు
* అక్రమాలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 1950
* భారత ఎన్నికల కమిషన్ డెరైక్టర్ జనరల్ పీకే దాస్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించే దిశగా ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టనుందని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(డీజీ) పీకే దాస్ వెల్లడించారు. అందుకు మీడియా కూడా సహకరించాలని కోరారు. ఎన్నికల్లో వ్యయ నియంత్రణ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చర్చాగోష్టిలో దాస్ పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే...


     అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరచి దాని ద్వారా చెక్కు రూపంలోనే చెల్లింపులు జరిపేలా నిబంధన పెడుతున్నాం.
 
     పరిమితికి మించి వ్యయం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తాం.
     వచ్చే ఎన్నికల్లో  అభ్యర్థుల వ్యయాన్ని నిశితంగా పరిశీలించేందుకు షాడో బృందాలు పనిచేస్తాయి. షెడ్యూల్ ప్రారంభం నుంచి అభ్యర్థులు  చేసే ప్రతి చర్యనూ పరిశీలించి ప్రతి అంశాన్నీ ఎన్నికల వ్యయంలో చేర్చుతూ రోజువారీ నివేదికలు రూపొందిస్తాయి.
     డబ్బు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం.
     అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించి సంబంధిత ఖర్చును వారి వ్యక్తిగత ఎన్నికల వ్యయంలో జమ చేస్తుంది.
     పెయిడ్ కథనాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చే నోటీసులకు 48 గంటల్లో అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాలి. పెయిడ్‌న్యూస్ కథనాలు పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. వాటిలో అనుభవజ్ఞులైన మీడియా ప్రతినిధులను కూడా నియమిస్తాం.
     ఓటర్లను చైతన్యపరచడంలో ముందుండే మీడియా సంస్థలకు ప్రత్యేక అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
     ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, నజరానాల పంపిణీ వంటి ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950ని ఏర్పాటు చేస్తాం. దీనికి వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డు చేయడంతోపాటు విచారణ తర్వాత చర్యల నివేదికను కూడా ఫిర్యాదుదారులకు అందజేస్తాం.
 కొన్ని పార్టీలకు సొంత వార్తాచానళ్లు ఉన్నాయని అవి ఆయా పార్టీలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నందున వాటిని ఎలా నియంత్రిస్తారనే ప్రశ్నకు.. దీనికి ప్రత్యేక నిబంధనలేవీ లేవని దాస్ స్పష్టం చేశారు. పెయిడ్‌న్యూస్ కథనాలకు మాత్రమే ఎన్నికల సంఘం నిబంధనలు రూపొందించిందని, పార్టీల వ్యయంపై పరిమితి ఏమీ లేదన్నారు. ఆయా పార్టీల ప్రచారంలో అభ్యర్థులపై ప్రత్యేక ప్రకటనలు, కథనాలు వస్తే మాత్రం ఆ ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారని తెలిపారు. ఎన్నికల వ్యయం విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అతి సున్నిత కేటగిరీలో ఉన్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు