దృష్టి పెట్టరే!

20 Nov, 2014 02:19 IST|Sakshi
దృష్టి పెట్టరే!

‘సీఎం చంద్రబాబుకు అనంత అంటే ఎనలేని ప్రేమ. అడక్కుండానే వరాలు ఇస్తున్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి.. పేదలకు మెరుగైన సేవలందిస్తార’ంటూ జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఏ కార్యక్రమానికి వెళ్లినా ఊదరగొడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం దేవుడెరుగు గానీ.. అందుబాటులో ఉన్న సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. కంటి ఆపరేషన్ థియేటర్ మూసేసి మూడు నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
 

అనంతపురం రూరల్ :  జిల్లాలోని పేదలకు సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. ఏ రోగమొచ్చినా ఇక్కడికి వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. చాలా వైద్యపరికరాలు చెడిపోయాయి. వాటి మరమ్మతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక కంటి ఆపరేషన్ థియేటర్ పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు.

ప్రతిరోజూ కంటి శుక్లాల(కాటరాక్ట్) ఆపరేషన్ల కోసం అనేకమంది వృద్ధులు ఆస్పత్రికి వస్తున్నారు. థియేటర్ మూసేశారని, ఎప్పుడు తెరుస్తారో తమకే తెలియదని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అంతోఇంతో ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు.

ఆపరేషన్లకు బ్రేక్
ఆస్పత్రిలో ప్రతిరోజూ 5-10 కంటి ఆపరేషన్లు  చేసేవారు. వైద్యులు సైతం పోటాపోటీగా ఆపరేషన్లు చేస్తూ మెరుగైన సేవలు అందించే వారు. థియేటర్ మూతపడడంతో ఆపరేషన్లకు బ్రేక్ పడింది. ఈ విభాగంలో ఇన్‌ఫెక్షన్ వ్యాపించి ఐదారు మందికి కంటిచూపు పోయింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.

కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఈ ఏడాది సెప్టెంబర్ 24న ‘అనంత’కు వచ్చారు. ఆపరేషన్ థియేటర్‌ను తనిఖీ చేశారు. ఇన్‌ఫెక్షన్‌కు గల కారణాలపై డిపార్‌‌టమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు నివేదిక అందించారు. అలాగే ఆగస్టు 20 నుంచి థియేటర్‌లో ఆపరేషన్లను బంద్ చేశారు.  
 
ఆపరేషన్ త్వరలోనే చేస్తామన్నారు
కంటిచూపు సరిగా లేదు. ఆస్పత్రిలో చూయించుకునేందుకు వచ్చా. చుక్కల మందు ఇచ్చారు. ఎప్పుడు నయమవుతుందో తెలియదు. ఆపరేషన్ త్వరలో చేస్తామని చెప్పారు.
 - ఉజ్జినప్ప, బోయినేపల్లి
 
ఓపీ తగ్గింది
ఆస్పత్రిలో కంటి వైద్యచికిత్సకు వచ్చే ఔట్‌పేషెంట్ల సంఖ్య బాగా తగ్గింది. కాటరాక్ట్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిచిపోవడమే ఇందుకు కారణం. డీఎంఈ నుంచి నివేదిక రావాల్సి ఉంది. ఆమోదం రాగానే థియేటర్‌ను పునరుద్ధరిస్తాం.
 - శ్రీనివాసులు, కంటి వైద్య విభాగాధిపతి
 
డీఎంఈ నుంచి ఆదేశాలు రావాలి
డీఎంఈ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే థియేటర్‌ను పునరుద్ధరిస్తాం.    
 - డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్

మరిన్ని వార్తలు