హైదరాబాద్ స్థానిక ఎన్నికలపై దృష్టి

21 May, 2014 00:36 IST|Sakshi
హైదరాబాద్ స్థానిక ఎన్నికలపై దృష్టి

పార్టీ పూర్తి స్వరూపానికి రెండేళ్లు పట్టొచ్చు   
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

 
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మరో ఆరు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టానని, పార్టీ పూర్తి స్వరూపానికి వచ్చేందుకు మరో రెండేళ్లు సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఒప్పుకున్న రెండు, మూడు చిత్రాలు చేయాల్సి ఉందని, అవి పూర్తయిన తర్వాత ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానన్నారు. తనకు ముందు నుంచి సినిమాలు చేయడం రెండో ప్రాధాన్యమేనని పవన్ చెప్పుకొచ్చారు.పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానన్నారు. అభివృద్ధికి సహజవనరులు ఎంత అవసరమో మోడీ అంతే వాడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇచ్చిన హామీలన్నీ ఆచరణ సాధ్యమా లేదా అన్నది తనకూ తెలియదన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పు చేసినా నిలదీస్తారా? అని అడగ్గా ఆచరణ సాధ్యం కాని హామీలను ఆయా పార్టీల దృష్టికి తెస్తాన న్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనడంపై స్పందిస్తూ రాజకీయాల్లో తన అన్న చిరంజీవి కంటే ఎక్కువ గౌరవం దక్కిందని తాను అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఓటమిపై మాట్లాడుతూ ‘‘నేనేదో నినాదం ఇచ్చినంత మాత్రాన అది జరగలేదు. సడన్‌గా మాట్లాడుతున్నప్పుడు అలా నోట్లోంచి వచ్చిందంతే. కాంగ్రెస్ అవలంబించిన విధానాలే ఆ పార్టీ ఓటమి కారణమయ్యాయి’’ అన్నారు. రాజకీయాల్లో అవినీతి, నేరస్తులను రూపుమాపాలనుకోవడం రాత్రికిరాత్రికి జరిగేవి కావని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఆయన తరఫున ప్రచారం చేయడం గురించి ఆలోచిస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు