ట్విన్ డ్యూటీ..భద్రతకు లేదు గ్యారంటీ

10 Feb, 2015 01:56 IST|Sakshi
ట్విన్ డ్యూటీ..భద్రతకు లేదు గ్యారంటీ

 సాక్షి, రాజమండ్రి :ఆర్టీసీలో డ్రైవర్లకు విధినిర్వహణ కత్తిమీద సాముగా మారుతోంది. దూరప్రాంత సర్వీసుల్లో డ్రైవర్ కం కండర్లుగా పని చేయడం ప్రాణాలతో చెలగాటమవుతోంది. డ్రైవింగ్ చేస్తూ, టిక్కెట్లు ఇస్తూ, సమయపాలనకు సంబంధించిన ఒత్తిడి మధ్యే జమా ఖర్చులు చూసుకుంటూ, నగదును కాపాడుకుంటూ, ప్రయాణికుల రక్షణ బాధ్యతను మరువకుండా ఏకాగ్రత తెచ్చుకుంటూ అష్టావధానం చేయాల్సి వస్తోంది. వీరి పనిభారం అటు ప్రయాణికులకూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నా.. ఆర్టీసీ పట్టించుకోకుండా డ్రైవర్లపై ట్విన్ డ్యూటీ (జంట విధులు) మోపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై ఒత్తిడి పెంచే ఈ విధానం వారితో పాటు జనం భద్రతనూ పణం పెట్టడమేనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం అంటేనే అమ్మో అనే పరిస్థితికి దారి తీస్తోంది.
 
  ఒకే ఉద్యోగితో రెండు విధులు చేయిస్తున్నా.. ఆర్టీసీ పారితోషికం మాత్రం నామమాత్రంగా ఇస్తోంది. ఒకవేళ పారితోషికం అధికంగా ఇచ్చినా దానికోసం ఇంతటి ఒత్తిడితో ఉద్యోగం చేస్తే ఎంత వరకూ సురక్షితం అన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ట్విన్ డ్యూటీ డ్రైవర్లు ఉంటున్నారు. హైదరాబాద్, అంతకు మించి దూరం ప్రయాణించే సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారని ఆర్టీసీ వాదిస్తోంది. కానీ వాస్తవంగా ఆ సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్లర్లు ఉండాలి. టిక్కెట్లు, ఇతర బాధ్యతలు కండక్టరు చూసుకుంటేనే డ్రైవర్‌లు కేవలం డ్రైవింగ్ మీదనే దృష్టి సారించగలుగుతారు. దీని వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుందన్న నిశ్చింతకు ఆస్కారం ఉంటుందని ఉద్యోగులు, ప్రయాణికులు అంటున్నారు.
 1,759 మంది డ్రైవర్లు..
 
 1,326 మంది కండక్టర్లు
 ఆర్టీసీ క్రమంగా ట్విన్ డ్యూటీ డ్రైవర్ల సంఖ్యను పెంచుతూ కండక్టర్ల సంఖ్యను తగ్గించేస్తోంది. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 850కి పైగా సర్వీసులు వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో 199 సర్వీసుల్లో డ్రైవర్లు ట్విన్ డ్యూటీలు చేస్తున్నారు. జిల్లాలో 1,759 మంది డ్రైవర్లు ఉంటే కండక్లర్ల సంఖ్య మాత్రం 1,326 మాత్రమే. జిల్లాలో 660 మంది డ్రైవర్లు ట్విన్ డ్యూటీలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా ఈ డ్రైవర్లకు రోజుకు ఎనిమిది గంటలు డ్యూటీ ఉండాల్సి ఉండగా, సగటున 10 నుంచి 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. మరో వంక రెండు డ్యూటీలు చేస్తున్నందుకు సంస్థ ఇస్తున్న అదనపు పారితోషికం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. కండక్టర్ విధులు కూడా చేసినందుకు కమీషన్ పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఒక ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం రూ.24 కంటే ఎక్కువ టిక్కెట్ జారీ చేస్తే ఒక రూపాయి, రూ.124 దాటిన టిక్కెట్ జారీ చేస్తే రెండు రూపాయలు కమీషన్ ఇస్తారు. అంటే 40 నుంచి 60 మంది ప్రయాణించే బస్సులో డ్యూటీ ముగిసే సరికి వచ్చే కమిషన్ రూ.60 నుంచి రూ.80 ఉంటోందని డ్రైవర్లు అంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు