ఎన్నికల నియమావళి పాటించండి

31 Jul, 2013 03:48 IST|Sakshi

 చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్:  జిల్లాలో బుధవారం జరగనున్న తది విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కాంతిరాణాటాటా హెచ్చరించారు. ఎస్పీ మంగళవారం విలేకరుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల బందోబస్తు వివరాలను వెళ్లడించారు. తుది విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 31 మండలాల్లో 469 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు.
 
  ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద చర్యలు తీసుకున్నామన్నారు. పలమనేరు పోలీస్ డివిజన్‌లో 1475 మంది, మదనపల్లె పోలీస్ డివిజన్‌లో 1410 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించినా, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించడానికి ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు