ఇక్కడ ప్రతి ఆహార పదార్థం కల్తీ!

26 Sep, 2019 11:48 IST|Sakshi

జోరుగా కల్తీ నూనెల విక్రయాలు

చీరాల నుంచి జిల్లా అంతటా సరఫరా

ఇప్పటికే పలుమార్లు దాడుల్లో బహిర్గతం

చోద్యం చూస్తున్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు

సాక్షి, చీరాల(ప్రకాశం): కల్తీ ఆహార పదార్థాలకు చీరాల మల్టీ బ్రాండ్‌గా మారింది. ఉప్పు..పప్పు.. కారం.. టీ పొడి నుంచి ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారింది. అయితే కల్తీలన్నింటిలో నూనెలదే పైచేయిగా ఉంది. పైకి బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో లోపల మాత్రం నాణ్యతలేని నాసిరకం నూనెను నింపి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. బ్రాండెడ్‌ వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి వచ్చే నీటిని కలిపి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్‌ అధికారులు దాడులు జరిపితే చీరాలలోని నూనె వ్యాపారులు అంతా దుకాణాలు సర్ది పరారయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

కొద్ది రోజుల క్రితం చీరాల పట్టణంలో ఓ బ్రాండెడ్‌ కంపెనీ పేరుతో కల్తీ నూనెలను విక్రయిస్తున్న దుకాణంపై అధికారులు దాడులు చేశారు. అక్కడ వేరుశనగ నూనె కావాలని కోరిన గ్రామీణులకు వ్యాపారులు కల్తీ నూనెనే విక్రయిస్తున్నారు. నూనె వ్యాపారుల కాసుల కక్కుర్తికి కొందరు అధికారులు తోడుగా నిలిచి నామమాత్రంగా కూడా తనిఖీలు చేయకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి తీసిన నూనెను కలిపి చీరాల్లోని వ్యాపారులు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

విడి వినియోగం ఎక్కువే..
చీరాల ప్రాంతంలోని బార్లు, రెస్టారెంట్లు, ఖానా ఖజానాలు, హోటళ్లు, మెస్‌లల్లో వంటకాల తయారీకి, తోపుడు బండ్లలో పిండివంటలు చీరాల్లోని నూనె దుకాణాలు, గానుగల నుంచి వంట నూనెలను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క చీరాల ప్రాంతంలోనే వీటి ద్వారా నెలకు రూ.90 లక్షలకు పైగా వ్యాపారాలు చేస్తుంటారు. తినుబండారాలు, ఆహార పదార్థాలు విక్రయించే వారు అధికంగా నూనె వినియోగిస్తుంటారు.

ఆహార పదార్థాలను తయారు చేసినప్పుడు మిగిలిన నూనెను మరుసటి రోజు వాడకుండా పారబోయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోకుండా ఆ నూనెలను వాడుతూనే ఉన్నారు. కల్తీ నూనెలతో వ్యాపారాలు చేసే వారికి కనీసం 95 శాతం మందికి లైసెన్స్‌లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కల్తీ నూనెలతో వంటపదార్థాలు తయారు చేసిన వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉన్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 

నెలకు రూ.కోటికి పైగా విక్రయాలు
కల్తీ నూనె విక్రయాలు నెలకు దాదాపుగా రూ. కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయంటే కల్తీ వ్యాపారం ఇక్కడ ఎంత జోరుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో  30 వరకు ప్రత్యేక నూనె దుకాణాలు ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు కల్తీ నూనె అమ్మకాలు  జరుగుతున్నాయి.  చీరాల నుంచి తయారైన కల్తీ నూనెను చీరాల, పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ నూనెల విక్రయాల్లో కనీసం 10 శాతం మేరకు ఇతర నూనెలు కలిపి నాసిరకం నూనె, విడినూనెలను బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు.

ఈ కల్తీ నూనె తయారీ, అమ్మకాల్లో దర్బార్‌ రోడ్డు, సంతబజారు, రామమందిరం వీధిలోని నూనె దుకాణాలు, కొన్ని హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారులు కీలకపాత్ర పోసిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నూనె దుకాణాలు ఇతర ప్రాంతాల నుంచి పత్తి గింజల నూనె, పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలను డ్రమ్ముల్లో చీరాలకు దిగుమతి చేసుకుని వేరుశనగ నూనెలో కల్తీలు చేసి బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు.   ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని నాసిరకం నూనెల డ్రమ్ములను దిగుమతి చేసుకుని ప్రజలకు బ్రాండెడ్‌ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. 

కల్తీ పక్కకు.. అసలు పరీక్షలకు..!
ఆహార భద్రతాధికారులు ప్రతినెలా నూనెలను తనిఖీలు చేయాల్సి ఉండగా వారు వచ్చే సరికి వ్యాపారులు కల్తీ నూనెల డ్రమ్ములను పక్కనబెట్టి బ్రాండెడ్‌ నూనెలను చూపించి వాటిని పరీక్షల కోసం హైదరాబాద్‌ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అక్రమ, కల్తీ వ్యాపారాల్లో అధికారులు పాత్ర కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.  నూనెలను కొనుగోళ్లు చేసిన హోటళ్లు, మెస్‌లు, పిండివంటల తయారీదార్లు నుంచి అధికారులు శాంపిళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తే కల్తీ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది.  కలీలకూ చెక్‌ పడుతుంది. కానీ ఆహారభద్రతా అధికారులు మాత్రం కేవలం బ్రాండెడ్‌ నూనెలను ల్యాబ్‌లకు పంపించడం వలన కల్తీ నూనె విషయం తెలియడం లేదు.

అనారోగ్యం తప్పదు
కల్తీ ఆహార పదార్థాలను భుజించడం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వంట నూనెల్లో కల్తీ వలన హృద్రోగ, రక్తనాళ సంబంధిత వ్యాధులు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కొవ్వు పెరిగి రక్తపోటు, కొన్ని సందర్బాల్లో గుండెపోటు, మొదడు పోటు వచ్చి ప్రాణాలను హరించివేస్తుంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పరిశుభ్రత లోపిస్తే అతిసారం, ఫుడ్‌పాయిజనింగ్, జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి.
డాక్టర్‌ ఎన్‌.రాజ్‌కుమార్, చీరాల 

మరిన్ని వార్తలు