ప్రసాదం తిన్న 70 మందికి అస్వస్థత

12 Apr, 2018 08:04 IST|Sakshi
బాలికకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ ఆలీ

వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రాములోరి భక్తులు

బల్లికురవ మండలం సూరేపల్లిలో ఘటన..

ఆలస్యంగా వెలుగులోకి..

సాక్షి, బల్లికురవ: రాములోరి కల్యాణమైన తర్వాత 16 రోజుల పండగ సందర్భంగా ఆదివారం కమిటీ సభ్యులు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఆ వడపప్పు, పానకం తాగిన వారిలో 70 మంది మంగళవారం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈ సంఘటన మండలంలోని సూరేపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. గత నెల 25న శ్రీరామనవమి సందర్భంగా  గ్రామంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఈ నెల 8వ తేదీన 16 రోజుల పండగ వెడుకలు నిర్వహించారు. హాజరైన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. వడపప్పు, పానకం తాగిన వారిలో గుర్రాల శ్రీనివాసరావు, కొమ్మాలపాటి రామాంజమ్మ, గుర్రా సింగరకొండ, కోటేశ్వరరావు, బొంతునాగమ్మ, బొంతు ఆంజనేయులుతో పాటు మొత్తం 70 మంది వరకు ఉన్నారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానికులు భయపడి గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సయ్యద్‌ అమీర్‌ ఆలీకి సమాచారం ఆందించారు.

వైద్యశిబిరం ఏర్పాటు
సమాచారం అందుకున్న వైద్యాధికారి గ్రామంలో తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడపప్పులో తేడా వల్లే ఇలా జరిగిందని, భయపడాల్సిన పనేమీ లేదన్నారు. నీరసంగా ఉన్న వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కొందరికి సెలైన్లు పెడుతున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఎండకు బయట తిరగకుండా ఉండాలని వైద్యుడు సూచించారు.

మరిన్ని వార్తలు