అంతా మా ఇష్టం!

3 May, 2019 11:21 IST|Sakshi

మల్టీఫ్లెక్స్, థియేటర్లలో ఆగని దోపిడీ

అధిక ధరలకు, తినుబండారాలు, పానీయాల విక్రయం

చోద్యం చూస్తున్న తూనికలు, కొలతలశాఖ అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో : పాప్‌కార్న్‌ కంటే బిర్యానీ ధర తక్కువ.. సినిమా టికెట్‌ కంటే తిను బండారాల రేట్లు ఎక్కువ.. ఓ మధ్య తరగతి కుటుంబం ఒక్కసారి అడుగు పెడితే దాదాపు రూ.వెయ్యి సమర్పించుకోవాల్సిన దుస్థితి.. నగరంలోని కొన్ని మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీ ఇది. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గతేడాది దాడుల పేరుతో హడావుడి చేశారు.. తర్వాత ఆ విషయం వదిలేశారు.

నిబంధనలు గాలికి...
ప్రేక్షకులకు ప్రత్యామ్నాయం లేదు.. బయటి నుంచి నీళ్ల సీసాలను అనుమతించరు. ప్రవేశ ద్వారం వద్దే పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. పోనీ.. లోపలైనా తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారా అంటే చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. దాహం వేస్తే కచ్చితంగా నీళ్ల సీసా కొనుక్కోవాల్సిందే. అదీ వాళ్లు ఎంత ధర చెబితే అంతకే. ఏఏ తినుబండారాలను విక్రయిస్తున్నారు..? ఎమ్మార్పీ (గరిష్ఠ చిల్లర ధర)ఎంత?. ఉల్లంఘనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర వివరాలతో కూడిన బోర్డులను నిబంధనల ప్రకారం కచ్చితంగా ఏర్పాటు చేయాలి. అధిక శాతం మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లలో ఇవి కనిపించవు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అవగాహన లేక ప్రేక్షకులు మిన్నకుండిపోతున్నారు.

హడావుడి చేసి వదిలేశారు...
గతేడాది తూనికలు, కొలతల శాఖాధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు భారీగా జరిమానా విధించారు. తీరు మార్చుకోవాలని నిర్వాహకులను హెచ్చరించారు. విడిగా తినుబండారాలను విక్రయించరాదని.. ప్రతిదానిపై ఎమ్మార్పీ, బరువు తదితర వివరాలతో కూడిన స్టిక్కర్‌ను అతికించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. తీరా చూస్తేనేమో అంత హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత ఒక్కసారి అటువైపు చూడలేదు.

అదిరే ధరలు...
అది గాంధీనగర్‌లోని ఓ థియేటర్‌..    ఆలూ సమోసా  20 రూపాయలు.. 750 ఎంఎల్‌ నీళ్ల సీసా రూ.30.. శీతల పానీయాలు(చిన్నవి) ఒకటి రూ.30.  బెజవాడలోని మరో థియేటర్‌లోనూ ఇదే  తీరు. ఇక్కడ చిన్న కప్‌ టీ తాగాలంటే రూ.20 సమర్పించుకోవాల్సిందే. మల్టీప్లెక్స్‌ల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెంజిసర్కిల్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో దోపిడీ అంతా కాదు. జంబో, స్మాల్, లార్జ్‌ అంటూ రకరకాల ఆఫర్ల పేర్లు చెప్పి ప్రేక్షకుల జేబులు గుల్ల చేస్తున్నారు. బయట రూ.20కి దొరికే నీళ్ల సీసా ఇక్కడ రూ.50. పాప్‌కార్న్‌ రూ.250. శీతల పానీయాలు (ఒక్కో గ్లాస్‌) రూ.80. ఆలూ సమోసా, పఫ్‌లు రూ.60.. సమీపంలోనే ఉన్న మరో మల్టీప్లెక్స్‌లోనూ ఇంచుమించు ఇవే ధరలు వసూలు        చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు