చిరుతిళ్ల పరిశ్రమలపై విజిలెన్స్‌ దాడులు

5 Feb, 2019 12:43 IST|Sakshi
విద్యాధరపురంలో తిమ్మిరి బిళ్లలను పరిశీలిస్తున్న పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర్లు

అనుమతులు లేకుండా చాక్లెట్లు, బిస్కెట్లు తయారీ

నాణ్యతా ప్రమాణాలు పాటించని వైనం

అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, ప్యాకింగ్‌

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): టేనర్‌పేటలో ఎటువంటి అనుమతులు లేకుండా చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆయా కంపెనీలపై దాడులు చేసిన క్రమంలో అపరిశుభ్ర వాతావరణంలో, చాక్లెట్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకులు చీమలు పట్టి, ఈగలు ముసురుతూ కనిపించాయి. చాక్లెట్లు, బిస్కట్ల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు, రవాణాకు సిద్ధంగా ఉన్న సరుకుతో పాటు కంపెనీలను సీజ్‌ చేశారు. టేనర్‌పేట అడ్డరోడ్డు,  మసీదు ప్రాంతాలలో రేలంగి జ్యోతిశ్వరరావు రాధా ప్రొడక్ట్‌ పేరిట నిమ్మతొనలు, పిప్పర్‌మెంట్‌ చాక్లెట్లు తయారు చేస్తుంటాడు. మహాలక్ష్మి ప్రొడక్ట్‌ పేరిట మరుపిళ్ల రామకృష్ణ, ఎం.దుర్గారావు ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంపెనీలను నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్‌ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు సిబ్బంది ఆయా కంపెనీలపై దాడులు నిర్వహించారు. చాక్లెట్లు, బిస్కట్ల తయారీకి ఎటువంటి అనుమతులు లేకపోవడమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, ప్యాకింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలను సీజ్‌ చేయడమే కాకుండా సరుకు స్వాధీనం చేసుకున్నారు.

విద్యాధరపురంలో...
భవానీపురం(విజయవాడ పశ్చిమం): విద్యాధరపురం కబేళా ప్రాంతంలో ఎటువంటి లైసెన్స్‌ లేకుండా చిన్నపిల్లల తినుబండారాలు తయారుచేసే ఫ్యాక్టరీలో విజిలెన్స్, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఫరీదా ఫుడ్‌ప్రొడక్టŠస్‌ పేరుతో షేక్‌ పర్వీన్‌ సుల్తానా అనే మహిళ తన భర్త రఫీతో కలిసి చిన్నపిల్లలు తినే తిమ్మిరి బిళ్లలు తయారు చేస్తున్నారు. అందుకు కావల్సిన లైసెన్స్‌లు తీసుకోకపోవడంతో సమాచారం అందుకున్న అధికారులు ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్‌ సీఐ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విజిలెన్స్‌ ఎస్‌పీ హర్షవర్ధన్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ కంపెనీకి ఫుడ్‌ సేఫ్టీ, ప్యాకేజీ, లేబర్‌ లైసెన్సలు లేవని తమ తనిఖీలో బయటపడిందని చెప్పారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొన్ని శ్యాంపిల్స్‌ సేకరించామని, వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి, వచ్చిన రిపోర్ట్‌నుబట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్‌ ఎస్‌ఐ సత్యనారాయణ, ఇనస్పెక్టర్స్‌ రమేష్‌బాబు, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు