బాధితులకు మందులేవీ !

1 Dec, 2013 03:31 IST|Sakshi

 ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం సక్రమంగా మందులు పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎయిడ్స్ నిర్మూలనకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే బాధితులకు కనీసం మందులు కూడా సరఫరా చేయకపోవడంతో వారు దీనావస్థలో ఉన్నారు. ఎయిడ్స్ దినోత్సవం అంటూ ఘనంగా ర్యాలీలు చేయడం తప్ప బాధితులకు కావలసిన సౌకర్యాలకు, తోడ్పాటు అందివ్వడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని స్వచ్ఛంద సంస్థలు, బాధితులు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి నెలకు సరిపడా ఏఆర్‌టీమందులను అందివ్వక పోవడంతో హెచ్‌ఐవీ బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగుంట్ల మండలంలో సుమారు 1600 మంది దాకా హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు గణాంకాలు ద్వారా తెలిసింది. ఒక్క ఎర్రగుంట్ల పట్టణంలోనే సుమారు 500 మంది దాక హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.
 
 గతంలో ఎర్రగుంట్లలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆస్పత్రిలో ఉండేది. దానిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి మార్చారు. దీంతో ఎర్రగుంట్లకు చెందిన బాధితులందరూ ప్రొద్దుటూరుకు పోయి ఏఆర్‌టీ మందులను తెచ్చుకుంటున్నారు. అయితే కొన్ని నెలల నుంచి ఏఆర్‌టీ మందులను కేవలం 15 రోజులకు సరిపడు మందులను మాత్రమే ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మిగిలిన 15 రోజులకు చెందిన మందులను మాత్రం బయట మార్కెట్‌లో డబ్బు పెట్టి కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా సమస్యగా ఉందని కొందరు బాధితులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు