నాకు, జనానికి నచ్చింది.. కానీ ఆడలేదు

4 Jul, 2014 02:05 IST|Sakshi
నాకు, జనానికి నచ్చింది.. కానీ ఆడలేదు

నటుడు గిరిబాబు

విజయవాడ కల్చరల్ : మంచినటుడిగా, ఉత్తమ అభిరుచిగల సినీ నిర్మాతగా గిరి బాబుకు పేరు ఉంది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన గురువారం విజయవాడలో ఎస్.వి.రంగారావు స్మారక పురస్కారం అందుకున్నారు.  ఈ సందర్భంగా ‘సాక్షి కల్చరల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
 ప్రశ్న : మీ సుదీర్ఘ సినీ జీవితం తృప్తినిచ్చిందా?
 జవాబు : నేను సినిమాల్లోకి వచ్చి 42 ఏళ్లు. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చాను. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసి నటుడిని కావాలనుకున్నా. నటుడిగా నా మొదటి సినిమా జగమేమాయ. ఇప్పటి వరకూ 550 సినిమాల్లో నటించా. సినీ జీవితం చాలా తృప్తిగా ఉంది.
 
 ప్ర : రాష్ట్రం విడిపోయాక తెలుగు సినిమా భవిష్యత్ ?
 జ : తెలుగు సినిమాకు ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల చొరవతో పరిశ్రమ ముందుకు సాగుతుందనే భావిస్తున్నా. ఎవరైనా ఇప్పటికిప్పుడు కొత్తగా పరిశ్రమను సృష్టించలేరుకదా.
 
 ప్ర : సినిమా పరిశ్రమను వారసత్వ నటులు శాసిస్తున్నారు కదా? ప్రతిభ గల నటులు రావటం లేదని వస్తున్న విమర్శపై మీ స్పందన?
 జ  : వారసత్వం అనేది సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఉంది. అన్ని భాషల  సినిమాల్లో వారసత్వ నటులు వస్తూనే ఉన్నారు. తెలుగులో కాస్త ఎక్కువ. నటుడుగా నిలబడాలంటే వారసత్వం ఒక్కటే చాలదు. ప్రతిభ ఉంటేనే ఎవరైనా రాణిస్తారు.
 
 ప్ర : తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే ప్రతిభగల నటులు రావటంలేదుకదా?
 జ : కరెక్టుకాదు. పొరుగింటి పుల్లకూర రుచి సామెత ఉంది కదా. అందుకే మనవారు పొరుగు భాషల నుంచి విలన్లను తెస్తున్నారు. అలాగని మన విలన్లు పరాయి భాషలో నటిం చిన సందర్భాలు చాలా తక్కువ. మనదే ఆ ప్రత్యేకత.
 
 ప్ర : గతంలో సినిమాలు నిర్మించిన మీరు ఇప్పుడు ఎందుకు నిర్మించడం లేదు?
 జ : ఇప్పటికి ఎనిమిది సినిమాలు నిర్మించాను. ఇప్పటి సినిమాలు కోట్లతో పని. ఈ పరిస్థితుల్లో సినిమాలు తీయడం నావల్ల కాదు. కుటుంబ సమేతంగా నిర్మించే సినిమాలే తీశాను. నా సినిమాలకు నేనే కథ, నేనే దర్శకత్వం వహించాను.
 
 ప్ర : నిర్మాతగా మీ తొలి చిత్రం?
 జ : దేవతలారా దీవించండి. ఆ తరువాత వరుసగా మెరుపుదాడి, సింహగర్జన, ముద్దుముచ్చట, సంధ్యారాగం మొదలైన సినిమాలు నిర్మించాను.
 
 ప్ర : ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లోనూ ప్రతిభకు అన్యాయం జరుగుతోందిగా?
 జ : నిజమే. 550 సినిమాల్లో నటించిన నాకు నంది అవార్డులు రాలేదు. కానీ న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు మాత్రం నాలుగు నందులు వచ్చాయి.
 
 ప్ర : మీరు సినిమాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటుతోందికదా. మీ సినీ చరిత్ర దాని గురించి ఏమైనా రాస్తున్నారా
 జ : నా జీవిత చరిత్ర రాసే పనిలో ఉన్నా. అయితే కొంత సమయం తీసుకోవచ్చు.
 
 ప్ర : మీకు నచ్చిన మీ సినిమా?
 జ : నాకు నచ్చిన సినిమా ‘సంధ్యారాగం’. ఈ సినిమా జనానికీ నచ్చింది. కానీ ఆడలేదు.
 
 ప్ర : ఈనాటి నటులకు మీరిచ్చే సలహా?
 జ : అద్భుతమైన కృషిచేస్తే తప్ప నటుడుగా నిలబడే రోజులు కావు. వారసత్వ నటులతో ఇబ్బందే.
 
 ప్ర :  ఒత్తిడికి గురైతే ఏమిచేస్తారు?

 జ : వృత్తిపరంగా ఒత్తిళ్లు ఉన్నపుడు స్వగ్రామం వెళ్లిపోతా. అక్కడే సేదతీరుతా. మా ఊరి కోసం జూనియర్ కాలేజీ, కల్యాణ మండపం నిర్మాణంలో నా వంతు సహాయం చేశా.
 

మరిన్ని వార్తలు